Madhav: భర్త ఆత్మహత్య... కేసును విచారిస్తుంటే భార్య హత్యోదంతం వెలుగులోకి!

  • ఈనెల 21న మాధవ్ ఆత్మహత్య
  • ఆపై కనిపించకుండా పోయిన భార్య సుమలత
  • ఇంటి తాళం పగులగొట్టగా లోపల మృతదేహం

రైలు కిందపడి ఒకతను ఆత్మహత్య చేసుకున్న కేసును ఛేదిస్తున్న క్రమంలో పోలీసులు, ఆయన భార్య హత్యోదంతాన్ని వెలుగులోకి తెచ్చిన ఘటన హైదరాబాద్ పరిధిలోని నల్లకుంటలో కలకలం రేపింది. మరిన్ని వివరాల్లోకి వెళితే నల్గొండ జిల్లాకు చెందిన మాధవ్ (30)కు, అదే జిల్లాకు చెందిన సుమలత (25)తో గత సంవత్సరం వివాహమైంది.

నల్లకుంట సిండికేట్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేసే మాధవ్ కు, సుమలతకు మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. భార్యపై అనుమానాన్ని పెంచుకున్న మాధవ్, ఈ నెల 21న విద్యానగర్ సమీపంలో ఎంఎంటీఎస్ రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మాధవ్ మృతి తరువాత సుమలత అదృశ్యం కావడంతో, ఆత్మహత్య వెనుక సుమలత ఉందా? అన్న కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు.

ఈ క్రమంలో కుమార్తె సుమలత జాడ తెలియని ఆమె తల్లిదండ్రులు నల్లకుంటలోని ఇంటికి వచ్చారు. తాళం వేసున్న ఇంటిని పగులగొడదామని ఇంటి యజమానికి చెప్పడంతో, ఆయన వారించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వచ్చిన తరువాత తాళం పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా, మంచంపై సుమలత మృతదేహం కనిపించింది. గొంతుకు చున్నీతో ఉరేసి, ఆపై దిండు ముఖంపై అదిమి ఊపిరాడకుండా చేసి చంపినట్టుగా పోలీసులు నిర్ధారించారు. అనుమానంతో ఆమెను హత్య చేసిన భర్త, ఇంటికి తాళం వేసి వెళ్లి, ఆత్మహత్య చేసుకున్నాడని భావిస్తున్న పోలీసులు, కేసును సమగ్రంగా దర్యాఫ్తు చేస్తామని తెలిపారు.

Madhav
Sumalatha
Sucide
Murder
Hyderabad
Police
  • Loading...

More Telugu News