ex jd laxmi narayana: ‘బిగ్ బాస్’ ను స్టార్స్ తో కాదు.. రైతులతో నిర్వహించాలి: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
- సామాజిక వర్గం కన్నా సమాజమే ముఖ్యం
- జిల్లాలో సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తా
- బాబు అపాయింట్ మెంట్ కోసం ఎదురుచూస్తున్నా
‘బిగ్ బాస్’ షో ను స్టార్స్ తో కాకుండా రైతులతో నిర్వహించాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు రోజులుగా లక్ష్మీనారాయణ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా కాకినాడలో నిర్వహించిన ‘ప్రజాస్వామ్య పరిరక్షణ సదస్సు’లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, సామాజిక వర్గం కన్నా, సమాజమే ముఖ్యమని, ప్రజాస్వామ్యం వైపు పూర్తిగా ప్రజలు తమ ఆలోచనలను మళ్లించాలని, రాజకీయ వ్యవస్థలో మంచి మార్పు తీసుకురావాలని సూచించారు. కాగా, జిల్లాలోని సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని, ఇప్పటికే ఆయన అపాయింట్ మెంట్ కావాలని అడిగానని, లక్కవరం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన అన్నారు.
చంద్రబాబుతో అపాయింట్ మెంట్ తేదీ ఫిక్స్ కాగానే తాను గుర్తించిన సమస్యలను ఆయనకు చెబుతానని అన్నారు. ఈ ప్రాంతంలో కొబ్బరి రైతుల సమస్యలు, మత్స్యకారుల సమస్యలు, చేనేత కార్మికుల సమస్యలను గుర్తించామని, ఓఎన్జీసీ వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఓ నివేదిక తయారు చేసి ముఖ్యమంత్రికి, సంబంధిత అధికారులకు అందజేస్తానని చెప్పారు.