Rajasthan: 7 నెలల పసి పాపను రేప్ చేసిన 19 ఏళ్ల యువకుడికి ఉరిశిక్ష విధించిన రాజస్థాన్ కోర్టు
- సంచలన తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి
- చట్టాలు కఠినమైన తరువాత తొలి తీర్పు
- ఘోరమైన తప్పుకు ఇదే సరైన శిక్షన్న న్యాయమూర్తి
రాజస్థాన్ స్పెషల్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఏడు నెలల శిశువుపై అత్యాచారం చేసిన 19 ఏళ్ల యువకుడికి ఉరిశిక్షను విధిస్తున్నట్టు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జితేంద్ర కుమార్ అగర్వాల్ తీర్పిచ్చారు. కేసు విచారణకు వచ్చిన తరువాత 70 రోజుల్లోనే తీర్పు వెలువడటం గమనార్హం. నిందితుడు అత్యంత ఘోరమైన నేరం చేశాడని, అతనికి సభ్య సమాజంలో తిరిగే హక్కుకానీ, భూమిపై జీవించే హక్కుకానీ లేవని జడ్జి వ్యాఖ్యానించారు.
రాజస్థాన్ లో అత్యాచారాలు, లైంగిక వేధింపుల చట్టాలను మరింత కఠినతరం చేస్తూ, మార్చిలో చట్ట సవరణ జరుగగా, ఆ తరువాత అత్యాచారం కేసులో మరణదండన తీర్పు వచ్చిన తొలి కేసు ఇదే. మే 9న పింటూ అనే యువకుడు, తన పొరుగింట్లోని పాపను తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. పాప కనిపించక తల్లిదండ్రులు వెతుకుతుంటే, కిలోమీటరు దూరంలోని ఫుట్ బాల్ మైదానంలో ఏడుస్తూ, రక్తమోడుతున్న పరిస్థితిలో కనిపించింది. పాపకు అల్వార్ లోని ఆసుపత్రిలో 20 రోజుల పాటు చికిత్సను అందించాల్సి వచ్చింది. ఆపై పింటూను పోలీసులు అరెస్ట్ చేశారు.