Pawan Kalyan: ఏపీకి న్యాయం జరిగే వరకు ‘జనసేన’ పోరాడుతుంది: పవన్ కల్యాణ్
- నిరసన కవాతులు చేస్తాం
- మడమ తిప్పకుండా ‘జనసేన’ పోరాటం చేస్తుంది
- రాష్ట్ర ప్రయోజనాలను టీడీపీ దెబ్బతీసింది
రాష్ట్ర విభజనతో నష్టపోయిన ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకి న్యాయం చేకూరే వరకూ పోరాటం చేస్తామని, ఒక రోజు బంద్ తోనో, కాగడాల ప్రదర్శనలతోనో సరిపెట్టుకోలేమని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
‘ప్రత్యేక హోదా సాధన, విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలు కోసం నిరంతరాయంగా పోరాటం చేయాల్సిందే. జనసేన పార్టీ చేపట్టిన పోరాట యాత్ర అందులో భాగమే. ప్రతి నియోజకవర్గ కేంద్రం నుంచి ప్రజల గళాన్ని, హోదా కోసం ప్రజలు పెంచుకున్న ఆశలు, ఆకాంక్షల్ని ఈ యాత్రలో వినిపిస్తాం. పాలక పక్షాలు విభజన సమయంలో ఏ విధంగా వంచించాయి... నాటి చట్టంలో పేర్కొన్న వాటిని అమలు చేయాల్సిన బాధ్యత కలిగిన నేటి పాలకులు ఏ రీతిన అన్యాయం చేస్తున్నారో ప్రజలు గ్రహిస్తున్నారు. పాలక పక్షాల ద్వంద్వ వైఖరిని, ప్రజల్ని మోసం చేస్తున్న తీరునీ ఖండిస్తూ నిరసన కవాతులు చేస్తాం. అయిదు కోట్ల ఆంధ్ర ప్రదేశ్ ప్రజల ఆకాంక్షను ఢిల్లీ వరకూ వినిపించేలా మడమ తిప్పకుండా పోరాటం చేస్తుంది ‘జనసేన’. ఈ విషయంలో న్యాయం జరిగే వరకూ ‘జనసేన’ ముందుకు వెళ్తుంది.
ప్రభుత్వంలో పాలన చేస్తున్నవారే విభజన హామీల అమలు విషయంలో ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారు. వారి రాజకీయ ప్రయోజనాలకు అనువుగా మాటలు మారుస్తున్నారనేది వాస్తవం. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో సమానంగా రాష్టంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అంతే దారుణంగా రాష్ట్ర ప్రయోజనాలని దెబ్బ తీసింది.
ప్రజల్ని రెండు పార్టీలు మోసం చేశాయి.. వంచించాయి. ఒక వైపు టీడీపీ ఎంపీలు బీజేపీని తిడతారు. మరో వైపు బీజేపీ కాళ్ళు మొక్కుతారు. ఈ ద్వంద్వ వైఖరిని ఎలా అర్థం చేసుకోవాలి? కేంద్ర హోమ్ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మా మిత్రుడే అని నిండు పార్లమెంట్ లోనే ప్రకటించారు. దీన్ని బట్టి మన ముఖ్యమంత్రి చేస్తున్నది ధర్మ పోరాటం అని ఎలా నమ్మగలం?’ అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.