Jagan: ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు: వైఎస్ జగన్
- తూ.గో.లో మత్స్యకారులతో ఆత్మీయ సమ్మేళనం
- మత్స్యకారులకిచ్చిన ఏ హామీని బాబు నెరవేర్చలేదు
- పేదలు, బీసీలపై ప్రేమ చూపించిన వ్యక్తి వైఎస్సార్
ఎన్నికలు వస్తున్నాయనగానే చంద్రబాబుకు ప్రజలు గుర్తొస్తారని, మళ్లీ మోసం చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారని వైసీపీ అధినేత జగన్ విమర్శలు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో జగన్ ప్రజా సంకల్పయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని అచ్చంపేట జంక్షన్ లో మత్స్యకారులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, మత్స్యకారులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు నెరవేర్చలేదని అన్నారు. నాలుగున్నరేళ్లుగా ఒక్కసారైనా డీజిల్ ధరపై సబ్బిడీ పెంచారా? రేషనలైజేషన్ పేరిట స్కూళ్లు, హాస్టళ్లను మూసేస్తున్నారని, స్కూళ్లలో పుస్తకాలు, యూనిఫామ్స్ ఇవ్వని పరిస్థితి కనిపిస్తోందని అన్నారు. ఏఫ్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు ఫిషింగ్ హాలిడేలో మత్స్యకారులకు అందించే ఆర్థికసాయం నూటికి పది మందికి కూడా రాదని ఆరోపించారు.
చంద్రబాబు ప్రభుత్వంలో మత్స్యకారులకు పెన్షన్ రాదని, మత్స్యకార కుటుంబాలకు హక్కుగా రావాల్సిన బకాయిలు రూ.130 కోట్లను ఇప్పటివరకు చెల్లించలేదని అన్నారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావడం కోసం బీసీలపై ప్రేమ చూపిస్తున్నారని, ఎన్నికల మ్యానిఫెస్టోలో ఒక్కో కులానికి ఒక్కో పేజీ కేటాయిస్తారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పేదలు, బీసీలపై ప్రేమ చూపించిన వ్యక్తి వైఎస్సార్ అని తన తండ్రిపై ప్రశంసలు కురిపించారు. పేదల కోసం వైఎస్ఆర్ ఒకడుగు ముందుకేస్తే, ఆయన కొడుకుగా తాను రెండడుగులు ముందుకేస్తానని అన్నారు. ‘మేము అధికారంలోకి రాగానే మీ పిల్లలను ఏది చదివించాలనుకుంటే అది చదివించండి. ఇందుకు ఎన్ని లక్షలు ఖర్చయినా భరిస్తాం’ అని జగన్ హామీ ఇచ్చారు.