raghuveera: ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద ఏపీ కాంగ్రెస్ నేతల ఆందోళన.. బీజేపీకి 325 ఓట్లు కూడా రావన్న రఘువీరా
- ఏపీని అవహేళన చేసే విధంగా మోదీ మాట్లాడారు
- వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలను కూడా ప్రస్తావించలేదు
- కాంగ్రెస్ నిరసనకు సంఘీభావం తెలిపిన రామకృష్ణ, చలసాని శ్రీనివాస్
ఏపీ పట్ల ప్రధాని మోదీ అనుసరిస్తున్న పక్షపాత వైఖరిని నిరసిస్తూ ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద ఏపీ కాంగ్రెస్ నేతల నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ ఈ సందర్భంగా నినాదాలు చేశారు. ఏపీ ప్రజలను నమ్మించి మోసం చేసిన బీజేపీకి ప్రజలు బుద్ధి చెబుతారని ఈ సందర్భంగా ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అన్నారు. ఏపీని అవహేళన చేసే విధంగా మాట్లాడిన ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్ నాథ్, బీజేపీ తీరును తాము ఖండిస్తున్నామని చెప్పారు.
14వ ఆర్థిక సంఘం వద్దని చెప్పినందుకే తాము ప్రత్యేక హోదాను ఇవ్వలేకపోయామని మోదీ చెప్పడం దారుణమని రఘువీరా అన్నారు. వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలను కూడా మోదీ ప్రస్తావించలేదని మండిపడ్డారు. లోక్ సభలో మోదీ అహంకారంతో వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవిశ్వాసంపై ఓటింగ్ లో బీజేపీకి 325 ఓట్లు వచ్చి ఉండవచ్చని... కానీ రానున్న ఎన్నికల్లో ఏపీలో మీకు 325 ఓట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. బీజేపీ చెప్పినట్టే వైసీపీ డ్రామాలు ఆడుతోందని విమర్శించారు. 2019లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే... ప్రత్యేక హోదా ఫైల్ పై సంతకం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేడీ శీలం, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, చలసాని శ్రీనివాస్ లు ఈ నిరసనకు సంఘీభావం తెలిపారు.