Telugudesam: గజినీలా టీడీపీ కూడా మెమొరీ లాస్ తో బాధపడుతోంది: పవన్ కల్యాణ్ ఎద్దేవా
- ఏపీ అంటే 25 మంది ఎంపీలు, 175 మంది ఎమ్మెల్యేలు కాదు
- 5 కోట్ల మంది ప్రజలకు జవాబుదారీగా ఉండాలి
- ఏం చేశారో టీడీపీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి
టీడీపీ వ్యవహారశైలిని తప్పుబడుతూ ట్విట్టర్ ద్వారా జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. 'గజినీ' సినిమాలో హీరో మాదిరి తెలుగుదేశం పార్టీ కూడా మెమొరీ లాస్ తో బాధపడుతోందని ఎద్దేవా చేశారు. ఏపీ అంటే కేవలం 25 మంది ఎంపీలు, 175 మంది ఎమ్మెల్యేలు మాత్రమే కాదని చెప్పారు. వాళ్లు మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పని... 5 కోట్ల మంది ప్రజలకు జవాబుదారీగా ఉండాలని అన్నారు. ఇప్పుడు కొత్త తరం వచ్చిందని, వారిని మౌనంగా ఉండే ప్రేక్షకులుగా అంచనా వేయవద్దని చెప్పారు.
అవసరానికి అనుగుణంగా జనసేన వ్యవహరించదని, ఏది మంచో అది మాత్రమే చేస్తుందని పవన్ అన్నారు. ప్రత్యేక హోదాను నీరుగార్చింది ఎవరు? బీజేపీతో చేతులు కలిపింది ఎవరు? అంటూ ఆయన ప్రశ్నించారు. ఇన్ని రోజులు ఏం చేసిందనే విషయాన్ని టీడీపీ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలని చెప్పారు. రానున్న రోజుల్లో మరోసారి మీరు మీ అవసరాలకు అనుగుణంగా మారబోమనే భరోసాను ఇవ్వగలరా? అని అన్నారు.