India: అది రహస్యం... రాహుల్ గాంధీ ప్రసంగంపై స్పందించిన ఫ్రాన్స్!
- రఫాలే డీల్ వెనుక కుంభకోణం ఉందన్న రాహుల్
- అధికారిక చర్చల సారాంశం రహస్యం
- 2008లో కుదిరిన ఒప్పందాన్ని గుర్తు చేసిన ఫ్రాన్స్
లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో పాల్గొన్న వేళ, రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ, 2016లో నరేంద్ర మోదీ సర్కారు ఫ్రాన్స్ తో రఫాలే డీల్ ను కుదుర్చుకోవడం వెనుక కుంభకోణం ఉందని, యుద్ధ విమానాల ధరను భారీగా పెంచారని ఆరోపించిన నేపథ్యంలో, ఫ్రాన్స్ స్పందించింది. 2008లో ఇండియాకు, తమకు మధ్య జరిగే అధికారిక చర్చల సారాంశాన్ని రహస్యంగా ఉంచాలన్న ఒప్పందం కుదిరిందని, అది 2016లో కుదిరిన రఫాలే డీల్ కు కూడా వర్తిస్తుందని పేర్కొంది. ఈ మేరకు ఫ్రాన్స్ విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
డీల్ గురించిన వివరాలు బయటకు వస్తే, రెండు దేశాల భద్రత, ఆయుధాల నిర్వహణా సామర్థ్యంపై ప్రభావం పడుతుందని ఫ్రాన్స్ అభిప్రాయపడింది. అది రెండు దేశాల రక్షణ ఉత్పత్తులకూ మంచిది కాదని తెలిపింది. కాగా, ఈ సంవత్సరం మార్చిలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ ఇండియాకు వచ్చినప్పుడు తాను కలిశానని, ఆయన తనకు చాలా విషయాలు చెప్పారని రాహుల్ ఆరోపించిన సంగతి తెలిసిందే. మొత్తం 36 రఫాలే యుద్ధ విమానాలు, వాటిల్లో అమర్చే ఆయుధాల కోసం యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి చర్చలు జరుగగా, ఎన్డీయే వచ్చిన రెండేళ్లకు డీల్ కుదిరింది. తాము ప్రతిపాదించిన ధరకు, డీల్ కుదుర్చుకున్న ధరకు ఎంతో వ్యత్యాసం ఉందని, మోదీ అవినీతికి పాల్పడ్డారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.