Srisailam: ఒక్క రోజులో ఏడు అడుగులు పెరిగిన శ్రీశైలం నీటిమట్టం!
- ఎగువన భారీగా వర్షాలు
- ఆల్మట్టి, తుంగభద్ర నుంచి నీటి విడుదల
- శ్రీశైలానికి 1.76 లక్షల క్యూసెక్కుల నీరు
ఎగువన కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర జలాశయాలకు వస్తున్న నీటిని దిగువకు వదులుతూ ఉండటంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం జలాశయానికి 1.76 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. ఒక్క రోజులోనే ప్రాజెక్టులో నీటిమట్టం ఏడు అడుగులకు పైగా పెరిగింది. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం జలాశయంలో 806 అడుగుల నీటిమట్టం ఉంది. ఇది పూర్తిగా నిండాలంటే ఇంకో 183 టీఎంసీల నీరు అవసరం.
ప్రస్తుతం వస్తున్న వరద కనీసం 10 రోజుల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయని జలసంఘం అధికారులు అంచనా వేశారు. 1.75 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుంటే, శ్రీశైలం నిండటానికి సుమారు రెండు వారాల సమయం పడుతుంది. తుంగభద్ర జలాశయానికి భారీ వరద వస్తుండటం, కర్ణాటకలో ముఖ్యంగా పశ్చిమ కనుమల్లో వర్షాలు కురుస్తుండటంతో, ఈ సీజన్ లో జులై నెలాఖరుకే శ్రీశైలం ప్రాజెక్టు నిండి, నీరు నాగార్జున సాగర్ కు కదిలేలా కనిపిస్తోంది.