Chandrababu: నేడు ఢిల్లీకి చంద్రబాబు.. రాజధాని వేదికగా మరోమారు విరుచుకుపడనున్న సీఎం!
- అవిశ్వాస తీర్మానానికి సహకరించిన పార్టీలకు కృతజ్ఞతలు
- మీడియా సమావేశం
- లోక్‌సభలో హైలైట్ జయదేవ్, రామ్మోహన్ ప్రసంగాలు
కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి సహకరించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పేందుకు నేడు చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. ఏపీకి జరుగుతున్న అన్యాయంతోపాటు, లోక్‌సభలో జరిగిన చర్చ గురించి ఢిల్లీలో మీడియాతో మాట్లాడతారు. టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో శుక్రవారం రోజంతా వాడివేడి చర్చ జరిగింది. టీడీపీ సభ్యులు గల్లా జయదేవ్, రామ్మోహన్‌నాయుడు తమ ప్రసంగంతో ఆకట్టుకున్నారు. జయదేవ్ అయితే కేంద్రం తీరుపై పార్లమెంటు సాక్షిగా దుమ్మెత్తి పోశారు. గణాంకాలతో సహా ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని వివరించారు.
ఒకసారి టీఆర్ఎస్, మరోసారి అధికార పక్ష నేతలు అడ్డుకోవడం తప్ప జయదేవ్ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ఇక చివరల్లో ఎంపీ రామ్మోహన్ నాయుడు హైవోల్టేజ్ స్పీచ్ ఇచ్చారు. హిందీలో అదిరిపోయేలా ప్రసంగించారు. ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని షార్ట్ కట్‌లో తనకిచ్చిన సమయంలో సూటిగా వివరించారు. మొత్తం సభలో వీరిద్దరి ప్రసంగాలు హైలైట్ అయ్యాయి. కాగా, అవిశ్వాసం కోసం తమకు సహకరించిన పార్టీ నేతలను నేడు చంద్రబాబు స్వయంగా కలిసి కృతజ్ఞతలు చెప్పనున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడతారు.