Chandrababu: నేను, కేసీఆర్ నిత్యమూ గొడవలు పడ్డామా?: మోదీపై చంద్రబాబు ఫైర్
- హామీల అమలు విషయంలో నిర్లక్ష్యం
- కనీసం సమస్యలను పరిష్కరిస్తామన్న మాట కూడా చెప్పని మోదీ
- లోక్ సభ ముగిసిన తరువాత చంద్రబాబు ప్రెస్ కాన్ఫరెన్స్
ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన విభజన హామీల అమలు విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారని తాము అవిశ్వాస తీర్మానం పెడితే, దానికి సమాధానంలో సుదీర్ఘ ఊకదంపుడు ఉపన్యాసం తప్ప, రాష్ట్రం గురించి మోదీ ఒక్క మాట కూడా మాట్లాడలేదని, కనీసం సమస్యలను పరిష్కరిస్తామన్న మాట కూడా ఆయన నోటివెంట రాలేదని చంద్రబాబు నిప్పులు చెరిగారు. నిన్న రాత్రి నరేంద్ర మోదీ ప్రసంగం, ఆపై ఓటింగ్ ముగిసిన తరువాత చంద్రబాబు ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించారు. కేసీఆర్ కు, తనకు వ్యక్తిగతంగా విభేదాలు ఉన్నాయని మోదీ మాట్లాడటాన్ని ఆయన ప్రస్తావిస్తూ, అది సరికాదని, మోదీ విషయ పరిజ్ఞానం లేనట్టుగా మాట్లాడారని మండిపడ్డారు. తనకు, కేసీఆర్ కు ఎలాంటి విభేదాలు లేవని, కేసీఆర్ తో తాను గొడవలు పడ్డానని చెప్పడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు.
తాను యూటర్న్ తీసుకున్నాననడం కూడా సరికాదని, ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి, తన స్థాయిని మరచి చౌకబారు ప్రసంగం చేశారని నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది కాబట్టే తాము చిట్ట చివరిగా అవిశ్వాస అస్త్రాన్ని ప్రయోగించామని, నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఈ పని చేయలేదని, ఏపీ గురించి, ఏపీకి జరిగిన అన్యాయం గురించి దేశమంతటికీ తెలియజేయాలనే ఈ పని చేశామని అన్నారు.