rajnath: నన్ను మంచి మిత్రుడని చెప్పుకోవడం కాదు..!: రాజ్ నాథ్ పై చంద్రబాబు విమర్శ
- ఏపీకి ఏం చేశారో రాజ్ నాథ్ చెప్పుంటే బాగుండేది
- వాస్తవాలు చెప్పే వరకు వదలొద్దు..నిలదీయండి
- టీడీపీ ఎంపీలకు టెలిఫోన్ లో చంద్రబాబు దిశానిర్దేశం
ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ విడిపోయినప్పటికీ, తమకు చంద్రబాబు మంచి మిత్రుడని లోక్ సభలో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తనను మంచి మిత్రుడని చెప్పుకోవడం కాదని, ఏపీకి ఈ నాలుగేళ్లలో ఏం చేశారో రాజ్ నాథ్ చెప్పుంటే బాగుండేదని సీఎం చంద్రబాబు అన్నారు. లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా టీడీపీ ఎంపీలకు టెలిఫోన్ ద్వారా చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
ఏపీ విషయంలో పాతపాటే పాడుతున్నారు తప్ప, చేసిందేమిటో స్పష్టంగా చెప్పట్లేదని, వాస్తవాలు చెప్పే వరకు వదలొద్దని, గట్టిగా నిలదీయాలని తమ ఎంపీలకు బాబు ఆదేశించినట్టు సమాచారం. ఏపీకి ఏం చేశారో నిజాయతీగా పున:సమీక్ష చేసినట్టు ఎక్కడా కనిపించట్లేదని, బీజేపీ నేతల మాటల్లో నిజాయతీ లేదని, కచ్చితమైన లెక్కలు చెప్పే వరకూ వదిలిపెట్టే ప్రశ్నే లేదని బాబు అన్నట్టు తెలుస్తోంది. అవిశ్వాస తీర్మానంపై చర్చలో రాజ్ నాథ్ సింగ్ మాట్లాడినట్టే, ప్రధాని మోదీ కూడా పాత పాటే పాడే అవకాశం ఉందని, సభలో గట్టిగా నిలదీయాలని టీడీపీ ఎంపీలతో చంద్రబాబు చెప్పినట్టు సమాచారం.