koppula sharat: శరత్‌ను చంపినోడు మామూలోడు కాడు... వెల్లడించిన అమెరికా పోలీసులు
- పోలీసుల కాల్పుల్లో హతమైన మాక్
- చిన్నప్పటి నుంచి నేర ప్రవృత్తే
- పలు కేసుల్లో జైలుకు
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన వరంగల్‌కు చెందిన కొప్పుల శరత్ ఇటీవల దారుణ హత్యకు గురయ్యాడు. మార్లిన్ జేమ్స్ మాక్ (25) అనే దుండగుడు శరత్‌ను కాల్చి చంపాడు. ఆదివారం పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితుడు హతమయ్యాడు. శరత్‌ను పొట్టనపెట్టుకున్న మాక్ మామూలోడు కాదని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మోస్ట్ వాంటెడ్ దోపిడీ దొంగల జాబితాలో అతడి పేరు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
మాక్ తండ్రి కూడా హంతకుడేనని పోలీసులు తెలిపారు. 2000 సంవత్సరంలో ఇద్దరిని హత్య చేసిన నేరంలో అతడు జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. ఇక మాక్ సైతం చిన్నప్పటి నుంచి నేర ప్రవృత్తి కలవాడే. 2009లో కార్లను ధ్వంసం చేసిన నేరంలో 15 ఏళ్ల వయసులోనే మాక్ టల్సాలో అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత రెండేళ్లకే స్కూలుకు తుపాకితో వచ్చిన నేరానికి మరోమారు జైలుపాలయ్యాడు. తుపాకితో ఓ మహిళను బెదిరించిన కేసులో 17 ఏళ్ల వయసులో మూడోసారి జైలుకెళ్లాడు. ఈ కేసులో మాక్‌కు ఐదేళ్ల శిక్ష పడింది. 2015లో జైలు నుంచి వచ్చి ఏడు నెలలు తిరగకముందే మారణాయుధాన్ని కలిగిన నేరం కింద మరోమారు కటకటాల వెనక్కి వెళ్లాడు.