Bribe: ఇక లంచం ఇచ్చిన వారూ ఊచలు లెక్కపెట్టాల్సిందే.. కొత్త చట్టం వచ్చేసింది!
- అవినీతి నిరోధక చట్టంలో మార్పులు
- సవరణ బిల్లుకు రాజ్యసభ ఏకగ్రీవ ఆమోదం
- గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా
ఇప్పటి వరకు లంచం పుచ్చుకోవడం నేరం. ఇప్పుడు లంచం ఇవ్వడం కూడా నేరమే. ఇందుకు సంబంధించిన బిల్లును రాజ్యసభ ఆమోదించింది. అవినీతి నిరోధక చట్టంలో కొన్ని నిబంధనలను సవరిస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు రాజ్యసభ మూజువాణి పద్ధతిలో ఏకగ్రీవ ఆమోదం లభించింది. సవరించిన చట్టం ప్రకారం.. ఇకపై లంచం ఇచ్చే వారిని కూడా నేరస్తులుగానే పరిగణిస్తారు. గరిష్టంగా ఏడేళ్లు, కనిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది. వ్యక్తులు, సంస్థలకు కూడా ఇది వర్తిస్తుంది.
అవినీతి కేసుల్లో సత్వర విచారణతోపాటు, దుర్బుద్ధితోచేసే ఫిర్యాదుల నుంచి పదవీ విరమణ చేసిన అధికారులకు రక్షణ కల్పించేందుకు బిల్లులో కొన్ని సవరణలు చేశారు. లంచం ఇచ్చే విషయంలోనూ కొన్ని మినహాయింపులు ఇచ్చారు. తప్పనిసరి పరిస్థితుల్లో లంచం ఇవ్వాల్సి వస్తే, అది జరిగిన ఏడు రోజుల లోపు విచారణ సంస్థలకు సమాచారం అందించవచ్చు. తద్వారా శిక్ష నుంచి బయటపడవచ్చు. ఈ గడువును మరింత పెంచాలని కేంద్రం యోచిస్తోంది. కాగా, బిల్లుకు ఆమోద ముద్రపడిన అనంతరం కేంద్రమంత్రి జితేంద్రసింగ్ మాట్లాడుతూ దీనినో చారిత్రక బిల్లుగా అభివర్ణించారు.