paruchuri gopalakrishna: సినారే చెప్పిన మాటను అక్షరాలా పాటించాను: పరుచూరి గోపాలకృష్ణ
- బీఎస్సీ పూర్తి చేశాను
- కొన్ని కారణాల వలన ఎమ్మే తెలుగులో చేరాను
- సినారే ఎప్పుడు క్లాస్ కి వస్తారా అని చూసేవాడిని
తెలుగు సినీ రచయితగా పరుచూరి గోపాలకృష్ణకి ఎంతో మంచి పేరు వుంది. తాజాగా ఆయన 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో మాట్లాడుతూ, సి.నారాయణ రెడ్డితో తనకి గల అనుబంధాన్ని గురించి ప్రస్తావించారు. "ఈ నెల 29వ తేదీన మా మాస్టారు సి. నారాయణ రెడ్డి జయంతి. ఆయన నాకు అక్షరాలు నేర్పలేదు .. అక్షర జ్ఞానం నేర్పారు. నా జీవితానికి ఉపయోగపడే ఎన్నో అద్భుతమైన సలహాలు ఇచ్చారాయన.
నేను విద్యార్థి దర్శలో ఉండగా మొట్టమొదటిసారిగా 'గులేబకావళి కథ' సినిమాలో సినారే పేరు తెరపై చూశాను. ఆ సినిమాలో 'నన్ను దోచుకుందువటే ..' పాటను ఎవరు మరిచిపోగలరు?. బీఎస్సీ పూర్తి చేసిన నేను కొన్ని కారణాల వలన ఎమ్మే తెలుగులో చేరాను. తొలి రోజు నుంచే ఎప్పుడు నారాయణ రెడ్డిగారు క్లాస్ కి వస్తారా అనే ఎదురుచూసేవాడిని.
నేను ఎమ్మే సెకండ్ ఇయర్ చదువుతూ ఉండగా పెళ్లి చేసుకున్నాను. సెకండియర్ పరీక్షలు రాసే ముందు .. 'పెళ్లి చేసుకున్నావు కదా .. ఏమైనా విశేషమా' అని సినారే అడిగారు. లేదు గురువు గారూ .. ఇంకా స్థిరపడలేదు గదా అన్నాను. 'ఆ ఆలోచన తప్పు .. ఏ ఉద్యోగం చేసినా 50 యేళ్లు వచ్చేలోగా బిడ్డలకి పెళ్లి చేసి .. కాన్పులు చేసి పంపించాలి. ఆ తరువాత సంపాదన తమ కోసం దాచుకోవాలి' అన్నారు. ఆయన చెప్పిన మాటను అక్షరాలా పాటించాను అని చెప్పడానికి ఆనందిస్తున్నాను" అన్నారు.