Banks: అమితాబ్ యాడ్‌పై బ్యాంకుల ఆగ్రహం.. బ్యాంకులపై విశ్వాసం పోయేలా ఉందన్న సంఘాలు!
- కల్యాణ్ జువెల్లర్స్ యాడ్‌పై బ్యాంకు సంఘాల ఆగ్రహం
- బ్యాంకులపై విశ్వాసం పోయేలా చిత్రీకరించారని ఆరోపణ
- కొట్టి పడేసిన కల్యాణ్ జువెల్లర్స్
కల్యాణ్ జువెల్లర్స్ కోసం అమితాబ్ బచ్చన్, ఆయన కుమార్తె శ్వేత నందా బచ్చన్ నటించిన యాడ్ బ్యాంకుల కోపానికి కారణమైంది. అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ఈ ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ యాడ్ బ్యాంకులపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని పోగొట్టేలా ఉందని, బ్యాంకులను అవమానకరంగా చిత్రీకరించారని ఆరోపిస్తున్నారు. మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థపైనే అపనమ్మకాన్ని కలిగించేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
బ్యాంకు సంఘాల ఆరోపణలను కల్యాణ్ జువెల్లర్స్ కొట్టిపడేసింది. అది ఎవరినీ ఉద్దేశించి తీసినది కాదని, ఫిక్షన్ మాత్రమేనని తేల్చి చెప్పింది. బ్యాంకు ఉద్యోగుల ఆగ్రహానికి కారణమైన ఈ యాడ్‌లో ఏముందంటే..
తనకు ఒక నెల పెన్షన్‌కు బదులు రెండు నెలల పింఛన్ వస్తుంది. తనకు న్యాయంగా రావాల్సింది ఒక నెల పింఛన్ మాత్రమే కావడంతో రెండో నెల పింఛన్ బ్యాంకుకు తిరిగి ఇచ్చేందుకు పింఛన్ దారుడు (అమితాబ్) తన కుమార్తెతో కలిసి బ్యాంకుకు వస్తాడు. రెండు కౌంటర్లలోని ఉద్యోగులు తొలుత అమితాబ్‌ను అవమానిస్తారు.
చివరికి ఓ ఉద్యోగి దగ్గరికి వెళ్లి విషయం చెబుతారు. దీంతో ఏం పర్లేదు పింఛన్ ను ఉంచుకోమని చెబుతాడు. ఎవరికి తెలుసని, ఎవరు చూస్తారని చెబుతూ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. అయితే ఇందుకు అమితాబ్ ఒప్పుకోడు. తనకు నమ్మకమే ముఖ్యమని అమితాబ్ చెప్పిన వెంటనే కల్యాణ్ జువెల్లర్స్ అని స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఆ వెంటనే నమ్మకమే ముఖ్యం అని కనిపిస్తుంది.