India: రోహిత్ శర్మను మరచిపోవాల్సిందే... రిషబ్ పంత్ వచ్చే శాడు... భారత టెస్టు జట్టు వివరాలు!
- ఆగస్టు 1 నుంచి ఇంగ్లండ్ తో ఐదు మ్యాచ్ ల సిరీస్
- తొలి మూడు టెస్టుల్లో రోహిత్ కు దక్కని స్థానం
- తొలిసారి జట్టులోకి వచ్చిన రిషబ్ పంత్
రోహిత్ శర్మను ఇక టెస్టు క్రికెట్ లో చూడలేమా? గతంలో పలు పర్యాయాలు విరాట్ కోహ్లీ నుంచి లభించిన మద్దతుతో టెస్టుల్లో స్థానం సంపాదించుకుని వరుస వైఫల్యాలను చూసిన రోహిత్ ను, త్వరలో ఇంగ్లండ్ తో తలపడే టెస్టులకు సెలక్షన్ కమిటీ ఎంపిక చేయలేదు. టీ-20 సిరీస్ లో సెంచరీతో రాణించినప్పటికీ, ఇంగ్లండ్ పిచ్ లపై టెస్టు మ్యాచ్ లను రోహిత్ ఆడలేడన్న భావనతోనే సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
తనకు మిడిలార్డర్ లో దూకుడుగా ఆడే ఆటగాడు కావాలని, ఒక్క సెషన్ లో మ్యాచ్ స్వరూపాన్ని రోహిత్ మార్చివేయగలడని చెబుతూ విరాట్ కోహ్లీ, గతంలో రోహిత్ కు వెన్నుదన్నుగా నిలిచి టెస్టు స్పెషలిస్టు పుజారాను, ఏ ఫార్మాట్ లో అయినా నమ్మదగ్గ రహానేలను గతంలో తప్పించాడు. ఈ సంవత్సరం దక్షిణాఫ్రికాతో టెస్టులకు రోహిత్ ను ఎంపిక చేస్తే నాలుగు ఇన్నింగ్స్ లో కలిపి అతను చేసింది 78 పరుగులు. ఆపై అతని స్థానంలో వచ్చిన రహానే కీలక ఇన్నింగ్స్ లు ఆడాడు. దీంతో ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ లో రోహిత్ ను పక్కన బెట్టాలని మేనేజ్ మెంట్ నిర్ణయించినట్టు తెలుస్తోంది.
ఇక ఇదే సమయంలో దేశవాళీ మ్యాచ్ లలో, ఐపీఎల్ లో అద్భుతంగా రాణించిన 20 ఏళ్ల రిషబ్ పంత్ ను స్పెషలిస్టు వికెట్ కీపర్ గా దినేష్ కార్తీక్ తో పాటు జట్టులోకి తీసుకున్నారు. జట్టుకు యువరక్తం అవసరమన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సెలక్షన్ కమిటీ తెలిపింది. యోయో టెస్టులో విఫలమై ఆఫ్గన్ తో జరిగిన ఏకైక టెస్టుకు దూరమైన మహ్మద్ షమీ, ఫిట్ నెస్ లేక వన్డే సిరీస్ కు దూరమైన జస్ ప్రీత్ బుమ్రాలూ జట్టులోకి వచ్చారు. ఆగస్టు 1 నుంచి ఈ ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ జరగనుంది.
భారత జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, మురళీ విజయ్, ఛటేశ్వర్ పుజారా, అజింక్య రహానె, కరుణ్ నాయర్, కార్తీక్, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్ దీప్ యాదవ్, హార్దిక్ పాండ్య, ఇషాంత్, మహ్మద్ షమి, ఉమేశ్ యాదవ్, జస్ ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్. (వీరి నుంచి తుది 11 మందినీ ఎంపిక చేస్తారు)