Tirumala: టీటీడీకి భక్తుల సలహాలు కావాలట... వాట్స్ యాప్ నంబర్ విడుదల!
- వాట్స్ యాప్ నంబరు 9399399399
- మహా సంప్రోక్షణ దర్శనాలపై సలహాలు ఇవ్వండి
- ఓ ప్రకటనలో కోరిన టీటీడీ
వచ్చే నెలలో తిరుమల శ్రీవారికి జరిగే మహా సంప్రోక్షణ కార్యక్రమంలోనూ భక్తులకు దర్శనాలు కల్పించాలని నిర్ణయించిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు, అందుకు సంబంధించిన విధివిధానాల ఖరారుకు భక్తుల నుంచి సలహాలు కోరుతోంది. టోల్ ఫ్రీ నంబర్లు 1800 425 4141, 1800 425 333 333, వాట్స్ యాప్ నంబరు 9399399399లకు భక్తులు తమ సలహాలు, సూచనలను పంపించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
మహా సంప్రోక్షణ సమయంలో 20 వేల నుంచి 30 వేల మందికి మాత్రమే దర్శనం చేయించే సౌలభ్యం ఉండటంతో, తొలుత దర్శనాలనే రద్దు చేస్తున్నట్టు ప్రకటించి విమర్శలు కొని తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఆపై ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలతో దిగొచ్చిన అధికారులు, 20 వేల మందిని ఎలా ఎంపిక చేయాలన్న విషయమై మీమాంసలో ఉన్నారు.
ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన దర్శనం చేయిస్తే, రోజుకు లక్షమంది భక్తులు వస్తున్న తిరుమలలో వారికి దర్శనం కావడానికే వారం రోజుల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. దీనికి బదులుగా ఆన్ లైన్లో టికెట్లను విక్రయించి దర్శనాలకు అనుమతించాలన్న ప్రతిపాదననూ అధికారులు పరిశీలిస్తున్నారు.