Jagan: అథవాలే వ్యాఖ్యలతో బీజేపీ-వైసీపీ లాలూచీ రాజకీయాలు బయటపడ్డాయి: యనమల
- కామన్ కేటగిరీ కింద ఏపీకి ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పండి
- అవినీతిపరుడితో పొత్తుకు బీజేపీ తహతహలాడుతోంది
- బీజేపీ చెప్పుచేతుల్లో పవన్ కల్యాణ్ ఉన్నారు
బీజేపీ, వైసీపీలపై మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ నేతలు అడగడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. చట్టం ప్రకారం ఇవ్వాల్సినవన్నీ ఇచ్చి, ఆ తర్వాత శ్వేతపత్రం గురించి అడగాలని అన్నారు. ఉపాధినిధులు, రోడ్లు, ఇళ్లు అన్ని రాష్ట్రాలకు ఇచ్చారని.. కామన్ కేటగిరీ కింద ఏపీకి ఎంత ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏయే కేటగిరీల కింద ఎతెంత ఇచ్చారో చెప్పాలని అన్నారు.
ఎన్టీయేలోకి వస్తే వైసీపీ అధినేత జగన్ ను ముఖ్యమంత్రిని చేస్తామని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే చేసిన వ్యాఖ్యలతో... ఇరు పార్టీల మధ్య ఉన్న లాలూచీ రాజకీయాలు తేటతెల్లమయ్యాయని యనమల చెప్పారు. అవినీతి కేసుల్లో ఇరుక్కున్న ఒక నిందితుడితో పొత్తుకు బీజేపీ తహతహలాడుతోందని మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా బీజేపీ చెప్పుచేతల్లోనే ఉన్నారని అన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీని ప్రశ్నించడం మానేసి... టీడీపీని విమర్శిస్తుండటమే దీనికి నిదర్శనమని చెప్పారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని... రానున్న ఎన్నికల్లో సరైన గుణపాఠం చెబుతారని అన్నారు.