Tirumala: మహా సంప్రోక్షణ సమయంలోనూ దర్శనాలకు అనుమతించాలి... భక్తుల మాటిది!
- ఆగస్టు 11 నుంచి మహా సంప్రోక్షణ
- భక్తుల సలహాలు కోరిన టీటీడీ
- ఆన్ లైన్ టికెట్ల వైపు మొగ్గు చూపిన అత్యధికులు
వచ్చే నెల 11 నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో మహా సంప్రోక్షణ జరిగే సమయంలోనూ భక్తుల దర్శనాలకు అనుమతించాలన్న నిర్ణయం తీసుకున్న టీటీడీ ఈ విషయంలో భక్తుల సలహాలు కోరింది. దర్శనాలను ఎలా కల్పించాలి? ఎంతమందికి కల్పించాలి? అనుసరించాల్సిన విధానం? వంటి అంశాలపై పలువురు భక్తుల నుంచి సలహాలు వచ్చాయి. ఆ ఆరు రోజుల్లోనూ దర్శనాలకు ఆన్ లైన్ లో టికెట్లను విక్రయించాలని అత్యధికులు వెల్లడించారు.
ప్రతి నెలా తొలి శుక్రవారం ఆర్జిత సేవల ఆన్ లైన్ విధానాన్ని ప్రారంభించే సమయంలో 11 నుంచి 16 వరకూ ఆన్ లైన్ లో టికెట్లను జారీ చేయాలని సూచించారు. తిరుపతిలోని సర్వదర్శన కౌంటర్లలో ఆయా రోజుల్లో అవకాశమున్నంత మందికి టోకెన్లు ఇచ్చి దర్శనానికి పంపాలని కొందరు, సర్వదర్శనం క్యూలైన్ కు ముందు వచ్చిన వారిని ముందు ప్రాతిపదికన అనుమతించాలని కొందరు సలహాలు ఇచ్చారు. ఈ ఆరు రోజుల్లో 60 సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే దర్శన అవకాశం కల్పిస్తే బాగుంటుందని కూడా సలహా వచ్చింది.
కాగా, మహా సంప్రోక్షణ ప్రారంభమయ్యే ఆగస్టు 11న 36 వేల మందికి, 12, 13 తేదీల్లో 27 వేల మందికి చొప్పున, 14న 20 వేల మందికి, 15న 18 వేల మందికి, 16న 13,500 మందికి దర్శనం కల్పించవచ్చని అధికారులు భావిస్తున్నారు.