PNB: మినిమం బ్యాలెన్స్ లేదని రూ.151 కోట్లు బాదేసిన పీఎన్‌బీ

  • 1.23 కోట్ల ఖాతాల్లో లేని కనీస మొత్తం
  • కోట్ల రూపాయల జరిమానాలు వసూలు చేస్తున్న బ్యాంకు
  • ఆర్‌బీఐ జోక్యం చేసుకోవాలన్న ఆర్థికవేత్త

వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి అప్పిచ్చి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ).. తాజాగా ఖాతాదారులకు షాకిచ్చింది. ఖాతాల్లో కనీస మొత్తం లేదన్న కారణంతో వారి ముక్కుపిండి మరీ రూ.151.66 కోట్లను జరిమానా రూపంలో వసూలు చేసింది. మొత్తం 1.23 కోట్ల ఖాతాదారులు తమ ఖాతాలను సరిగా నిర్వహించడం లేదని, నెలలో ఉండాల్సిన సగటు మొత్తాన్ని కూడా ఉంచడం లేదన్న కారణంతో ఈ జరిమానాలు వసూలు చేసింది.

సమాచార హక్కు చట్టం కింద ఆర్టీఐ కార్యకర్త చంద్రశేఖర్ గౌడ్ పీఎన్‌బీని వివరాలు కోరగా బ్యాంకు ఈ విషయాన్ని వెల్లడించింది. పీఎన్‌బీ తీరుతో స్పందించిన ఆర్థికవేత్త జయంతిలాల్ భండారీ మాట్లాడుతూ.. భారతీయ రిజర్వు బ్యాంకు వెంటనే జోక్యం చేసుకుని పెనాల్టీల విషయంలో సమీక్షించాలని కోరారు. బ్యాంకు వసూలు చేసిన జరిమానా మొత్తం మధ్య తరగతి, పేదల ఖాతాల నుంచేనని జయంతిలాల్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, పీఎన్‌బీ 2018 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.31.99 కోట్లు, రెండో త్రైమాసికంలో రూ.29.43 కోట్లు, మూడో త్రైమాసికంలో రూ.37.27 కోట్లు, నాలుగో త్రైమాసికంలో రూ.52.97 కోట్లను జరిమానాల రూపంలో వసూలు చేసింది.

  • Loading...

More Telugu News