Crude Oil: దిగొస్తున్న క్రూడాయిల్... బ్యారల్ 70 డాలర్లకు చేరిక!
- సౌదీ సహా ఒపెక్ దేశాల నుంచి పెరిగిన ఉత్పత్తి
- మార్కెట్ వాటా పోగొట్టుకోలేక రష్యా కూడా
- నవంబర్ వరకూ తగ్గుదలేనంటున్న నిపుణులు
ఇరాన్ పై ఆంక్షల నేపథ్యంలో చమురు సరఫరా నిలిచినా, సౌదీ అరేబియా ఆ లోటును భర్తీ చేస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్టే జరుగుతోంది. కొద్ది రోజుల క్రితం 80 డాలర్లకు చేరి భయపెట్టిన ముడిచమురు ధర ఇప్పుడు కాస్తంత దిగొచ్చింది. సౌదీ అరేబియా, అమెరికాలు క్రూడాయిల్ ఉత్పత్తిని పెంచడంతో ప్రస్తుతం బ్యారల్ ముడిచమురు ధర 70 డాలర్లకు చేరువైంది.
ఒపెక్ సభ్య దేశాలుగా ఉన్న కువైట్, యూఏఈ కూడా ముడి చమురు ఉత్పత్తిని పెంచాయి. దీంతో తమ మార్కెట్ వాటా తగ్గుతుందన్న ఆందోళనతో ఉన్న రష్యా కూడా అదే పనిచేయడంతో ధరలు తగ్గాయని చమురు నిపుణులు వ్యాఖ్యానించారు. గత నెలలో బ్యారల్ క్రూడాయిల్ ధర 80 డాలర్లకు చేరిన సంగతి తెలిసిందే. సోమవారం నాడు 4.6 శాతం, మంగళవారం నాడు మరో 1.2 శాతం ధర తగ్గింది.
కాగా, ఈ సంవత్సరం నవంబర్ నుంచి ఇరాన్ పై ఆంక్షలు అమల్లోకి రానుండగా, ఆ దేశం నుంచి క్రూడాయిల్ దిగుమతి చేసుకునే అన్ని దేశాలపైనా ఆంక్షలుంటాయని ట్రంప్ కరాఖండిగా చెబుతున్నారు. ఇక ఆంక్షలు అమల్లోకి వస్తే, ఒక్కసారిగా 25 లక్షల బ్యారళ్ల చమురు లోటు ఏర్పడుతుంది. అంత లోటును భర్తీ చేయగల శక్తి సౌదీ తదితర ఒపెక్ దేశాలకు ఉందా? అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ విషయంలో తేడా వస్తే, చమురు ధరలు భగ్గున మండుతాయనడంలో సందేహం లేదు.