smruthi irani: స్మృతి ఇరానీతో భేటీ అయిన కేటీఆర్.. నేతన్నల సమస్యలపై చర్చ!
- ఢిల్లీ పర్యటనలో ఉన్న కేటీఆర్
- చేనేత కార్మికుల సమస్యలపై స్మృతి ఇరానీతో చర్చలు
- నేతన్నల గురించి టీఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలను వివరించిన కేటీఆర్
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, చేనేత కార్మికుల సమస్యల గురించి కేంద్ర మంత్రితో చర్చించినట్టు కేటీఆర్ చెప్పారు. పవర్ లూమ్, హ్యాండ్ లూమ్ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించానని తెలిపారు.
నేతన్నలను ఆదుకునేందుకు, ప్రోత్సహించేందుకు టీఎస్ ప్రభుత్వం దాదాపు రూ. 1200 కోట్లతో ప్రారంభించిన పథకాలను ఆమెకు వివరించానని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో కొత్త హ్యాండ్లూమ్ క్లస్టర్ లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. మరో 10 క్లస్టర్లను ఏర్పాటు చేయాల్సిందిగా స్మృతి ఇరానీని కోరానని చెప్పారు. క్లస్టర్ల ఏర్పాటు కోసం కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉందని, నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందని తెలిపారు.