Iphone: సముద్రంలో పడిపోయిన ఐఫోన్... స్కూబా డైవర్ కు దొరికి ఇంకా పనిచేస్తోంది!
- సముద్రంలో పడిపోయిన కెనడియన్ ఫోన్
- 48 గంటల తరువాత కనిపెట్టిన స్కూబా డైవర్
- అప్పటికీ పనిచేస్తున్న ఐఫోన్ 7
ఒక ఫోన్ పొరపాటున నీళ్లలో పడితేనే దాన్ని వదిలేసి కొత్త ఫోన్ కొనుక్కోవాలి. కొంచెం ఖరీదైన ఫోన్ అయితే, సర్వీస్ ఇంజనీర్ వద్దకు తీసుకెళ్లితే పనిచేస్తుందేమో. ఇక చాలాసేపు నీళ్లల్లో ఫోన్ పడిపోతే దానిపై ఆశలు వదిలేసుకోవాల్సిందే. అయితే, నాణ్యతకు మారుపేరైన యాపిల్ ఫోన్లకు మాత్రం ఇది వర్తించదు. సముద్రంలో పడిపోయిన యాపిల్ ఐఫోన్ 7, నాని నాని కూడా ఇంకా పనిచేస్తూనే ఉంది. 'డిజిటైమ్స్' వెల్లడించిన వివరాల ప్రకారం, ఇది సముద్రంలో ఉన్నప్పుడు కూడా సిగ్నల్స్ ను సరిగ్గా అందుకుంది.
కెనడాకు చెందిన ఓ వ్యక్తి ఐఫోన్ పొరపాటున సముద్రంలో పడగా, దాన్ని గురించి వెతికి అలసిపోయిన ఆయన, ఇక లాభంలేదనుకుని వెళ్లిపోయాడు. ఈ ఘటన ఇంగ్లండ్ లోని డోర్డల్ డోర్ దగ్గర జరిగింది. ఇక యూకేకు చెందిన స్కూబా డైవర్ సిరీస్ హార్సీ అదే ప్రాంతంలో డైవింగ్ చేస్తూ వెళ్లింది. ఎక్కడో లోపలి నుంచి సన్నగా మెరుపు కనిపించడంతో అదేంటో చూద్దామని వెళ్లింది. టెక్ట్స్ మెసేజ్ వచ్చినప్పుడు ఫోన్ వెలిగిన వెలుగది. దాన్ని చూసిన ఆమె షాక్ తింటూ బయటకు తీసుకు వచ్చింది. దాదాపు 48 గంటల పాటు నీటిలోనే ఉన్న ఫోన్, 84 శాతం బ్యాటరీతో మంచిగా పనిచేస్తోంది. తనకు దొరికిన ఫోన్ ను ఆమె పోగొట్టుకున్న కెనడియన్ కు అందించింది. వాటర్ రెసిస్టెన్స్ ఐపీ 67 రేటింగ్ ను కలిగివుండటమే ఫోన్ ను కాపాడిందని 'డిజిటైమ్స్' వెల్లడించింది.