Tirumala: తిరుమల ఆలయంలో జరిగే మహా సంప్రోక్షణ ప్రత్యక్ష ప్రసారం అసాధ్యం: జేఈఓ శ్రీనివాసరాజు
- ఆగమ శాస్త్రానికి పూర్తి విరుద్ధం
- వెండి వాకిలి వెలుపల మాత్రమే సీసీ కెమెరాలు
- లోపల జరిగే క్రతువును చూపడం అపచారం
తిరుమల శ్రీవారి ఆలయంలో వచ్చే నెల 11 నుంచి జరిగే మహా సంప్రోక్షణ సమయంలో స్వామి దర్శనం లేకున్నా, మిగతా క్రతువులను దర్శించుకునేందుకు భక్తులను అనుమతించ వచ్చుగా అన్న ప్రశ్నకు అది అసాధ్యమని, ఆగమ శాస్త్రానికి పూర్తి విరుద్ధమని టీటీడీ జేఈఓ శ్రీనివాసరాజు సమాధానం ఇచ్చారు. ఓ టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, ఆలయంలోనూ వెండి వాకిలి వెలుపల మాత్రమే కెమెరాలను అమర్చి ఉంచామని గుర్తు చేసిన ఆయన, ఆ లోపల జరిగే ఏ క్రతువుపైనా కెమెరాలు, లైట్ ఫోకస్ వేసేది లేదని, అది ఎంతో పెద్ద అపచారం అవుతుందని చెప్పారు.
మహా సంప్రోక్షణను ప్రత్యక్ష ప్రసారం చేసేది కూడా లేదని, పూర్ణకుంభంలో ఉన్న స్వామి అంశపై కెమెరాల ఫోకస్ పెట్టడం, సాక్షాత్తూ స్వామిని చిత్రీకరించినట్టేనని అభిప్రాయపడ్డ ఆయన, లైవ్ టెలికాస్ట్ అసాధ్యమని స్పష్టం చేశారు. లైవ్ టెలికాస్ట్ లేనంత మాత్రాన రహస్యంగా ఏదో జరుగుతుందని భక్తులు అపోహ చెందాల్సిన అవసరం లేదని, వందలాది మంది రుత్వికులు మహా సంప్రోక్షణకు సాక్షులుగా ఉంటారని తెలిపారు. కొండపైకి భక్తులను అనుమతించేది లేదని టీటీడీ చెప్పినట్టుగా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీన్ని నమ్మవద్దని ఆయన కోరారు.