Tirumala: తిరుమల ఆలయం మూసివేత వెనుక కుట్ర: శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అనుమానం!
- సీసీ కెమెరాలు ఆపివేయడం ఏంటి?
- మహా సంప్రోక్షణను భక్తులు తిలకించవచ్చు
- భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి
- విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి
పరమ పవిత్రమైన తిరుమల శ్రీ వెంకటేశ్వరుని ఆలయంలో మహా సంప్రోక్షణ పేరుతో ఆలయాన్ని తాత్కాలికంగా మూసి వేస్తామని చెప్పడం వెనుకు కుట్ర దాగివుందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి. ఆ సమయంలో సీసీ కెమెరాలను సైతం ఆపివేస్తామని టీటీడీ అధికారులు చేసిన ప్రకటనపై విస్మయం వ్యక్తం చేసిన ఆయన, పాలకమండలి, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని అన్నారు.
ఆగమశాస్త్రం ప్రకారం మహా సంప్రోక్షణ యావత్తూ భక్తులు తిలకించవచ్చని గుర్తు చేసిన ఆయన, ఆలయం మూసివేత నిర్ణయం తీసుకునే ముందు కంచి, శృంగేరి వంటి పీఠాలతో సంప్రదించారా? అని ప్రశ్నించారు. తిరుమల వ్యవహారాలు భక్తుల్లో అనుమానాలను పెంచుతున్నాయని, ఇప్పటికైనా ఆగమ పండితుల సలహాలు తీసుకుని, దాని ప్రకారం ముందుకెళ్లాలని సలహా ఇచ్చారు.