SBI: ఆ డబ్బులు కక్కండి.. 70 వేల మంది ఉద్యోగులకు ఎస్‌బీఐ భారీ షాక్!
- అనుబంధ బ్యాంకులకు సర్క్యులర్ జారీ
- ఓవర్ టైమ్ డబ్బులు వెనక్కి ఇచ్చేయాలంటూ ఆదేశాలు
- మండిపడుతున్న ఉద్యోగులు
అనుబంధ బ్యాంకులకు చెందిన 70 వేలమందికిపైగా ఉద్యోగులకు భారతీయ స్టేట్ బ్యాంకు అదిరిపోయే షాకిచ్చింది. నోట్ల రద్దు సమయంలో అదనంగా పనిచేసినందుకు గాను చెల్లించిన డబ్బులను వెంటనే వెనక్కి ఇవ్వాలని ఆదేశాలు చేసింది. డీమోనిటైజేషన్ సమయానికి ఆయా బ్యాంకులు ఎస్‌బీఐలో విలీనం కాలేదని, కాబట్టి వారు తమ ఉద్యోగులు కాబోరని పేర్కొంది. తమ ఉద్యోగులుగా పొరబడి చెల్లించిన ఆ సొమ్మును వెంటనే తిరిగి ఇచ్చేయాలంటూ అన్ని జోనల్ కార్యాలయాలకు సర్క్యులర్లు పంపింది.
నోట్ల రద్దు సమయంలో పరిస్థితులను చక్కదిద్దేందుకు బ్యాంకు ఉద్యోగులు అదనంగా కొన్ని గంటలు పనిచేశారు. అందుకోసం డబ్బులు చెల్లిస్తామని ఆయా బ్యాంకుల యాజమాన్యాలు ఉద్యోగులకు తెలిపాయి. దీంతో పరిస్థితులు కొలిక్కి వచ్చే వరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్‌లకు చెందిన 70 వేలమందికిపైగా ఉద్యోగులు ఓవర్ టైమ్ చేశారు.
నోట్ల రద్దు తర్వాత ఏప్రిల్ 1, 2017న పైన చెప్పిన ఐదు బ్యాంకులు భారతీయ స్టేట్ బ్యాంకులో విలీనం అయ్యాయి. అనుబంధ బ్యాంకుల ఉద్యోగులందరూ ఎస్‌బీఐ ఉద్యోగులుగా మారడంతో అదనపు పనిగంటలకు సంబంధించిన డబ్బును ఎస్‌బీఐ చెల్లించింది. అధికారి స్థాయి ఉద్యోగికి రూ.30 వేలు, సిబ్బందికి రూ.17 వేలు చొప్పున చెల్లించింది.
తాజాగా, ఇప్పుడు నాలుక్కరుచుకున్న ఎస్‌బీఐ పొరపాటు జరిగిపోయిందని, నోట్ల రద్దు సమయానికి బ్యాంకులు ఎస్‌బీఐలో విలీనం కాలేదని, కాబట్టి వారు తమ ఉద్యోగులు కాబోరని పేర్కొంది. తమ ఉద్యోగులు కాని వారికి తామెలా చెల్లిస్తామని, కాబట్టి ఓవర్ టైమ్ నిమిత్తం చెల్లించిన సొమ్మును వెంటనే వెనక్కి ఇచ్చేయాలని ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకు ప్రకటనపై ఉద్యోగులు మండిపడుతున్నారు. బ్యాంకు నిర్ణయంపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.