jagan: జగన్ పాదయాత్ర రోడ్ల మీద కాదు, అబద్ధాల మీద నడుస్తోంది: మురళీమోహన్ కోడలు రూప
- జగన్ చేసిన ఆరోపణలన్నీ అబద్ధమే
- మాపై చేసిన ఆరోపణలు 24 గంటల్లో నిరూపించాలి
- ఏపీకి ఇంకో పదేళ్లు మంచి ప్రతిపక్ష నేత కావాలి
వైఎస్ జగన్ తనపై చేసిన ఆరోపణలను 24 గంటల్లోగా నిరూపించాలని టీడీపీ ఎంపీ మురళీమోహన్ కోడలు రూప డిమాండ్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఈరోజు ఆమె మాట్లాడుతూ, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో తనకు ప్రభుత్వ భూమి ఉన్నట్టు నిరూపిస్తే, తనపై ఏ కేసులకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఇతరులపై ఆరోపణలు చేసే ముందు ఆలోచించుకోవాలని, ఆధారాలుంటేనే ఆరోపణలు చేయాలని జగన్ కు హితవు పలికారు. రాజమండ్రి బలభద్రపురంలో తనకు ప్రభుత్వ స్థలం ఇస్తానన్నా వద్దన్న విషయాన్ని ఆమె ప్రస్తావించారు.
‘ప్రభుత్వం రైతుల నుంచి తీసుకున్న భూములను, తమకు ప్రభుత్వం కేటాయించిందని జగన్ చేస్తున్న ఆరోపణలు అవాస్తవం. ఆ భూములు రైతులవి కావు..అవి ఏపీఐఐసీ భూములు. ఆ భూములను అలీఫ్ అనే ఒక ఆర్గనైజేషన్ కు కేటాయించారు. జగన్ గారు చెబుతున్నట్టు యాభై, అరవై ఎకరాలు కాదు. 34.5 ఎకరాలు. అలీఫ్ సంస్థకు, నాకు ఎటువంటి సంబంధం లేదు. అలీఫ్ అనేది సోషల్ ఆర్గనైజేషన్. దానికి ఓ వెబ్ సైట్ ఉంది. అన్ని వివరాలు అందులో ఉంటాయి. ఎవరైనా ఆ వెబ్ సైట్ లో వివరాలను తెలుసుకోవచ్చు. సామాజిక కార్యక్రమాలు చేయడమంటే నాకు ఇష్టం. మంచి పనులు చేసే ఆర్గనైజేషన్స్ తో కలిసి నేను పనిచేస్తాను.
‘అలీఫ్’తో మురళీమోహన్ గారికి కానీ, నాకు కానీ ఎలాంటి సంబంధం లేదు. జగన్ చేస్తున్న ఆరోపణలన్నీ వంద శాతం కాదు, రెండొందల శాతం అబద్ధం. అందుకే కదా, మాపై చేసిన ఆరోపణలను 24 గంటల్లో నిరూపించాలని జగన్ గారికి టైమిచ్చింది! జగన్ గారు మా చంద్రబాబునాయుడు గారు వేసిన రోడ్ల మీద నడవట్లేదు. ఆయన పాదయాత్ర అబద్ధాల మీద నడుస్తోంది. ఇప్పటికే చాలా కిలోమీటర్లు ఇలా అబద్ధాల మీద నడిచేశారు. ఇంకా, ఎన్ని కిలోమీటర్లు ఇలా అబద్ధాలు చెప్పుకుంటూ నడుస్తారో? జగన్ గారికి నా విన్నపం.. మా రాష్ట్రానికి ఇంకో పదేళ్ల పాటు మంచి ప్రతిపక్ష నేత కావాలని కోరుకుంటున్నా. కొంచెం నైతిక విలువలు ఉన్న ప్రతిపక్ష నేత కావాలని కోరుకుంటున్నాం' అన్నారు రూప.