Krishna River: కృష్ణమ్మ పరుగులు... రేపే ఆల్మట్టి గేట్లు ఎత్తేసే చాన్స్!
- 1.20 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో
- కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలు
- 1,699 అడుగులకు చేరిన నీటిమట్టం
కర్ణాటకలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆల్మట్టి రిజర్వాయర్ కు వరద పోటెత్తింది. ఈ ఉదయం లక్ష క్యూసెక్కులుగా ఉన్న వరద నీరు ప్రస్తుతం 1.20 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. సాయంత్రానికి జలాశయానికి వస్తున్న వరద 1.50 లక్షల క్యూసెక్కులకు పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రాజెక్టులో 1,705 అడుగుల మేరకు నీటి నిల్వ సామర్థ్యం ఉండగా, ఇప్పటికే 1,699 అడుగులకు నీటిమట్టం చేరింది. ఆల్మట్టి రిజర్వాయర్ లో 1,703 అడుగులకు నీరు చేరితే కిందకు విడుదల చేయడం మొదలవుతుంది. పై నుంచి వచ్చే వరద అంచనాకు అనుగుణంగా గేట్లను తెరుస్తారు. ఈ క్రమంలో ఇంకా వర్షాలు కురుస్తూ ఉండటంతో రేపు ప్రాజెక్టు గేట్లను ఎత్తివేసే అవకాశాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఆల్మట్టి నుంచి వదిలితే, రోజుల వ్యవధిలోనే కృష్ణా బేసిన్ లో ఉన్న రిజర్వాయర్లు జలకళను సంతరించుకుంటాయి.