Jupalli Krishnarao: "గంటలో ఐజీతో ఫోన్ చేయిస్తా... ఏం తమాషానా?" సీఐని బెదిరిస్తున్న తెలంగాణ మంత్రి జూపల్లి... వైరల్ అవుతున్న ఆడియో!
- వివాదంలో చిక్కుకున్న జూపల్లి కృష్ణారావు
- ప్రభుత్వమంటే ఏంటో చూపిస్తానని బెదిరింపు
- సూసైడ్ చేసుకుని చస్తానన్న సీఐ జనార్దన్ రెడ్డి
తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఓ వివాదంలో చిక్కున్నారు. ఓ సీఐతో మాట్లాడుతూ ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాకు ఎక్కి వైరల్ అవుతున్నాయి. "నేను జూపల్లి కృష్ణారావు... మినిస్టర్ ను మాట్లాడుతున్నా. ఏం మాట్లాడుతున్నావు? తమాషా చేస్తున్నవా? గంటలో ఐజీ ఫోన్ చేస్తడు. ప్రభుత్వమంటే ఏంటో చూపిస్తా. ఏయ్... నీ పేరేంటి? నీది ఏ స్టేషన్? చెప్పేది విను. ఈ నంబర్ ను డీజీకి ఫార్వర్డ్ చేస్తా" అని జూపల్లి వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. పెద్దపల్లి జిల్లా ధర్మారంలోని ఓ భూవివాదం నేపథ్యంలో మంచిర్యాల జిల్లా తాండూరు సీఐ జనార్దన్ రెడ్డిని జూపల్లి బెదిరించారు.
శనివారం నాడు జూపల్లి ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) వీరారెడ్డికి జనార్దన్ ఫోన్ చేసిన సందర్భంగా ఈ ఘటన జరిగింది. మధ్యలో ఫోన్ తీసుకున్న మంత్రి, సీఐతో వాగ్వాదానికి దిగి బెదిరించారు. ఇదేం ధర్మం, న్యాయం? అని సీఐ కూడా వాదనకు దిగగా, జూపల్లి మండిపడ్డారు. ధర్మారంలో తన సోదరికి చెందిన స్థలం వివాదంలో ఉండగా, అవతలివారికి వీరారెడ్డి మద్దతు పలుకుతున్నారని చెప్పిన సీఐ, తాను కూడా డీజీకి జరిగిందేమిటో చెబుతానని, సూసైడ్ చేసుకుని చస్తామని అన్నారు. ఈ ఆడియో సంభాషణ ఇప్పుడు వైరల్ అవుతోంది.