BJP: వచ్చే ఎన్నికల్లో బరిలోకి సినిమా స్టార్లు, క్రీడాకారులు.. బీజేపీ వ్యూహమిదే!
- వచ్చే ఎన్నికల్లో బీజేపీ ‘కలరింగ్’
- బరిలోకి సినీ ప్రముఖులు
- గత ఎన్నికల వ్యూహం రిపీట్
వచ్చే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పావులు కదుపుతున్న భారతీయ జనతా పార్టీ పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పలువురు ఆటగాళ్లు, పద్మ అవార్డుల గ్రహీతలు, పారిశ్రామికవేత్తలు, సినిమా స్టార్లను బరిలోకి దింపాలని యోచిస్తోంది. గత ఎన్నికల్లో ఈ వ్యూహం ఫలితాన్నివ్వడంతో మళ్లీ ఇప్పుడు దానినే అనుసరించాలని పథక రచన చేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే కొందరి పేర్లను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది.
ప్రతీ సందర్భంలోనూ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్న బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్, నానాపటేకర్‌లను వరుసగా పంజాబ్, ఢిల్లీ, మహారాష్ట్ర నుంచి పోటీకి దింపాలన్నది బీజేపీ వ్యూహం. అయితే అక్షయ్ కుమార్‌కు భారత పౌరసత్వం లేదు. కెనడా పౌరసత్వం ఉన్న ఆయన దానిని వదులుకుని భారత పౌరసత్వం తీసుకుంటే తప్ప పోటీ అసాధ్యం. పౌరసత్వాన్ని మార్చుకోవాలని బీజేపీ అధిష్ఠానం నుంచి అక్షయ్‌కు ఇప్పటికే సమాచారం అందినట్టు తెలుస్తోంది. తాజా వార్తలపై అనుపమ్ ఖేర్ స్పందిస్తూ ప్రస్తుతం తాను అమెరికాలో ఉన్నానని, ఆరు నెలల్లో తిరిగి రానున్నట్టు చెప్పారు. నానాపటేకర్ మాత్రం స్పందించేందుకు నిరాకరించారు.