YSRCP: కీలక నిర్ణయం తీసుకున్న జగన్.. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు 'నో'!
- బీజేపీకి వ్యతిరేకంగా ఓటు
- పార్లమెంటు ఆవరణలో నిరసన ప్రదర్శనలు
- వైసీపీ నిర్ణయం
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో జరగనున్న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలనే విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓ నిర్ణయానికి వచ్చింది. ఆదివారం రాత్రి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని గొల్లల మామిడాడ వద్ద పార్టీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి కీలక నేతల, ప్రాంతీయ కోఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించారు. మూడు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం ముగిసిన తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ఆ వివరాలను వెల్లడించారు.
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కోసం జరగనున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించినట్టు ధర్మాన తెలిపారు. అలాగే, సమావేశాలు జరిగినన్ని రోజులు పార్లమెంటు ఆవరణలో నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని తీర్మానించినట్టు పేర్కొన్నారు. ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైనందుకు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయనున్నట్టు ఆయన తెలిపారు.