Nawaz Sharif: ఎన్నో ఏళ్లుగా కడగని బాత్ రూమ్... కనీసం బెడ్ కూడా ఇవ్వలేదు: నవాజ్ జైలు గదిపై కుమారుడు హుస్సేన్
- కనీస సదుపాయాలు కల్పించలేదు
- చాలా ఇబ్బందులు పడుతున్న సోదరి
- ట్విట్టర్ లో హుస్సేన్ షరీఫ్
తన తండ్రికి అడియాలా జైలులో బీ-గ్రేడ్ సౌకర్యాలు కల్పించామని చెప్పుకుంటున్న అధికారులు, కనీస సదుపాయాలు కూడా కల్పించలేదని, ఆయనకు సరైన పడకను కల్పించలేదని నవాజ్ షరీఫ్ కుమారుడు హుస్సేన్ షరీఫ్ ఆరోపించారు. తన తండ్రి ఉన్న గదిలో సరైన బెడ్ లేదని, బాత్ రూమ్ శుభ్రంగా లేదని, ఎన్నో ఏళ్లుగా దాన్ని శుభ్రం చేయలేదని అన్నారు.
తన సోదరి సైతం జైల్లో చాలా ఇబ్బంది పడుతోందని, తన తండ్రికే ఇటువంటి సౌకర్యాలు కల్పిస్తుంటే, సాధారణ ఖైదీల పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో తెలుసుకోవాలని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు. జైలు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని కొందరు జైలు సిబ్బంది తనకు చెప్పారని హుస్సేన్ షరీఫ్ తెలిపారు. ఓ ప్రజా ప్రతినిధిగా గౌరవంగా బతికిన తన తండ్రి, ఇప్పుడు కనీస హక్కులు లేని జీవితంలోకి వెళ్లారని అన్నారు.