Ganta Srinivasa Rao: సెలవు రోజున స్కూల్ పెట్టిన కారణమిదే... గోదావరి పడవ ప్రమాదంపై మంత్రి గంటా!
- నిన్న పశువుల్లంక వద్ద నదిలో పడవ బోల్తా
- సిలబస్ పూర్తి కానందునే శనివారం నాడు స్కూల్
- ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు
- ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు
నిన్న సాయంత్రం తూర్పు గోదావరి జిల్లా ఐ పోలవరం మండలం పశువుల్లంక వద్ద గోదావరినదిలో పడవ బోల్తా పడి, ఏడుగురు గల్లంతుకాగా, అందులో ఐదుగురు స్కూల్ విద్యార్థులు ఉన్నారన్న సంగతి తెలిసిందే. రెండో శనివారం పాఠశాలలకు సెలవుకాగా, స్కూల్ ఎందుకు పెట్టారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ, ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. అనుకున్న సమయానికి సిలబస్ పూర్తికాక పోవడంతోనే శని, ఆదివారాల్లో పాఠశాలలు నడపాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. పడవ ప్రమాదం ఘటన విచారకరమని వ్యాఖ్యానించిన ఆయన, నదిలో నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉన్నందునే ప్రమాదం జరిగిందని అభిప్రాయపడ్డారు. మరోసారి ఇటువంటి ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకుంటామని, నదిపై నిర్మాణంలో ఉన్న వంతెనను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేస్తామని చెప్పారు.