బాలీవుడ్ నటి సన్నీలియోన్‌కు కొత్త కష్టాలు
- బయోపిక్ నుంచి ‘కౌర్’ పదాన్ని తొలగించాలని డిమాండ్
- ఆ పదాన్ని ఉపయోగించుకునే అర్హత ఆమెకు లేదన్న గురుద్వార
- బహిరంగ క్షమాపణకు డిమాండ్
‘కౌర్’ను ఉపయోగించడం వల్ల సిక్కుల మనోభావాలు దెబ్బతింటాయని ఎస్‌జీపీసీ అడిషనల్ సెక్రటరీ, అధికార ప్రతినిధి దల్జీత్ సింగ్ బేడీ అన్నారు. సన్నీలియోన్ సిక్కు మత విశ్వాసాలను పాటించడం లేదని, కాబట్టి ఆ పేరును ఉపయోగించడం తగదన్నారు. అసలా పదాన్ని ఉపయోగించే హక్కే ఆమెకు లేదని కుండబద్దలుగొట్టారు.
సిక్కు గురువులు ఇచ్చిన ‘కౌర్’ అనే పదం చాలా పవిత్రమైనదని ఆయన పేర్కొన్నారు. సిక్కు బోధనలను పాటించని వారికి ఆ పదాన్ని ఉపయోగించుకునే అర్హత లేదన్నారు. ఈ పదాన్ని ఆమె ఉపయోగించడాన్ని సిక్కులెవరూ హర్షించరన్నారు. సన్నీలియోన్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.