Tirumala: తిరుమలను నిర్మానుష్యం చేయబోము... దర్శనం లేకున్నా యాత్రికులకు అనుమతి: టీటీడీ
- తొలుత నడక మార్గాలను మూసేస్తున్నట్టు ప్రకటించిన టీటీడీ
- వెంకన్నను కాకున్నా, ఇతర ఆలయాలను దర్శించుకోవచ్చన్న సూచనలు
- భక్తుల రాకపై ఆంక్షలు లేవని స్పష్టం చేసిన పుట్టా
వచ్చే నెలలో తిరుమల శ్రీవెంకటేశ్వరుని ఆలయంలో మహా సంప్రోక్షణం సందర్భంగా స్వామి దర్శనం పూర్తిగా నిలిపేయాలని నిర్ణయం తీసుకున్న టీటీడీ, తొలుత నడక మార్గాలను మూసివేయాలని నిర్ణయం తీసుకుని, ఆపై దాన్ని సవరించుకుంది. తిరుమలను పూర్తి నిర్మానుష్యం చేయడం మంచిది కాదని, వచ్చే భక్తులు ఇతర ఆలయాలు, పవిత్ర ప్రదేశాలను దర్శించుకుని వెళ్లే అవకాశాన్ని కల్పించాలని వచ్చిన సూచనలకు అనుగుణంగా కొన్ని మార్పులను టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ప్రకటించారు.
యాత్రికులను, భక్తులను అడ్డుకోబోమని, అయితే, స్వామి దర్శనం లభించదని తిరుపతి, అలిపిరిలో కరపత్రాలను పంచి పెడతామని అన్నారు. తిరుమలకు వచ్చే భక్తులపై ఎలాంటి ఆంక్షలూ ఉండవని చెప్పారు. మహా సంప్రోక్షణం జరిగే రోజుల్లో సుప్రభాత సేవ ఏకాంతంగా ఉంటుందని, మిగతా అన్ని ఆర్జిత సేవలూ రద్దు చేశామని చెప్పారు. భక్తులు తమ పర్యటనలను వాయిదా వేసుకోవాలని సూచించారు.