France: ఫ్రాన్స్ గెలుపు కోసం ఇండియాలో పూజలు
- నేడు ఫ్రాన్స్, క్రొయేషియా మధ్య పైనల్
- ఫ్రాన్స్ గెలవాలని కోరుకుంటున్న పుదుచ్చేరి
- తమ జట్టు ఓడుతుందని అనుకోవడం లేదంటున్న ఫ్రెంచ్ పౌరులు
నేడు వరల్డ్ కప్ ఫుట్ బాల్ ఫైనల్ పోరు ఫ్రాన్స్, క్రొయేషియా మధ్య మాస్కోలో జరగనుండగా, ఫ్రాన్స్ గెలవాలని ఇండియాలో పూజలు జరుగుతున్నాయి. పుదుచ్చేరి, యానాం ప్రాంతాల్లో ఫ్రెంచ్ మూలాలున్నవారు ఎంతో మంది ఉండగా, వారంతా ఫ్రాన్స్ గెలవాలని కోరుకుంటున్నారు. ఇండియాను ఆక్రమించుకుని తన సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలని భావించిన ఫ్రాన్స్ పోరాటం, పుదుచ్చేరి వద్ద ఆగిపోయిన సంగతి తెలిసిందే.
ఇండియా మొత్తాన్ని బ్రిటన్ ఆక్రమించినా, పుదుచ్చేరి, యానాం వంటి ప్రాంతాలు ఫ్రెంచ్ కాలనీలుగా మిగిలిపోయాయి. ఇక్కడుండే రహదారులు, బైలైన్లు, రెస్టారెంట్లు అన్నీ ఫ్రెంచ్ పట్టణాన్ని గుర్తుకు తెస్తుంటాయి. నిన్న పౌరులను ఉద్దేశించి ప్రసంగించిన పుదుచ్చేరి ఫ్రెంచ్ కౌన్సిల్ జనరల్ కేథరిన్ సువార్డ్, ఫ్రాన్స్ విజయాన్ని ఇక్కడి వాళ్లంతా ఆకాంక్షిస్తున్నారని చెప్పారు.
కాన్సులేట్ వద్ద జెయింట్ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పిన ఆమె, ఆహారం, పానీయాలను సిద్ధం చేశామని, ఫ్రాన్స్ గెలిస్తే, షాంపేన్ ను పొంగిస్తామని అన్నారు. ఇక్కడ నివసిస్తున్న ఫ్రెంచ్ పౌరులు, అసలు ఫ్రాన్స్ ఫైనల్ కు వస్తుందని భావించలేదని, ఇప్పుడిక తమ జట్టు ఓడిపోతుందని ఎంతమాత్రమూ భావించడం లేదని వ్యాఖ్యానించారు. కాగా, ఈ మ్యాచ్ నేటి రాత్రి 8.30 (భారత కాలమానం ప్రకారం)కి ప్రారంభం కానుంది.