Nawaz Sharif: దోమల రొద, పాత పరుపు... నిద్రలేని రాత్రి గడిపిన నవాజ్ షరీఫ్!
- అల్పాహారంగా ఎగ్ ఫ్రై, పరోటా
- బీ-క్లాస్ ఖైదీగా పరిగణింపు
- నిరక్షరాస్యులకు చదువు చెప్పే బాధ్యతలు
శుక్రవారం రాత్రి లండన్ నుంచి రాగానే లాహోర్ నుంచి రావల్పిండికి, ఆపై అక్కడి నుంచి అడియాలా జైలుకు తరలించబడిన పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె మర్యంలు ఆ రోజు రాత్రంతా నిద్రపోలేదని తెలుస్తోంది. జైలుకు వీరి తరలింపు ప్రక్రియ పూర్తయ్యేటప్పటికి తెల్లవారుజాము అయింది. జైల్లో నవాజ్ ను బీ-క్లాస్ ఖైదీగా పరిగణిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
ఓ మంచం, కుర్చీ, లాంతరు, అల్మరా సౌకర్యం కల్పించామని అధికారులు తెలుపగా, పాత మంచం, పరుపు కావడం, దోమల రొద ఎక్కువగా ఉండటంతో ఆయనకు నిద్రపట్టలేదని జైలు అధికారి ఒకరు తెలిపారు. శనివారం ఉదయం ఆయనకు ఎగ్ ఫ్రై, పరోటా, టీ ఇచ్చామని చెప్పారు. సీ-క్లాస్ ఖైదీల్లోని నిరక్షరాస్యులకు చదువు చెప్పే బాధ్యతను ఆయనకు అప్పగించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.