Chandrababu: చంద్రబాబు డైరెక్షన్ లోనే కాంగ్రెస్ లో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి: బీజేపీ
- కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనను అడ్డుకోలేకపోయారు
- సొంత తమ్ముడిని కూడా గెలిపించుకోలేకపోయారు
- బీజేపీపై విష ప్రచారాన్ని చంద్రబాబు మానుకోవాలి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ లో చేరడంపై బీజేపీ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు డైరెక్షన్ లోనే కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారని భారతీయ జనతా పార్టీ యువమోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగోతు రమేష్ నాయుడు ఆరోపించారు. రాష్ట్ర విభజనను అడ్డుకోలేకపోయిన కిరణ్ కుమార్ రెడ్డి ఏపీ ప్రజల దృష్టిలో ద్రోహిగా మిగిలిపోయారని అన్నారు. సమైక్యాంధ్ర పార్టీని స్థాపించి, సొంత తమ్ముడిని కూడా గెలిపించుకోలేక పోయారని ఎద్దేవా చేశారు.
ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో రాష్ట్రానికి రావాల్సిన వాటిని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లేందుకు త్వరలోనే ఢిల్లీకి వెళ్తామని చెప్పారు. రానున్న పార్లమెంటు సమావేశాల్లో పోలవరం ప్రాజెక్టు, విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి స్పష్టమైన ప్రకటన వెలువడుతుందని తెలిపారు. బీజేపీపై చేస్తున్న విషప్రచారాన్ని ఇప్పటికైనా చంద్రబాబు మానుకోవాలని సూచించారు. రాష్ట్రాభివృద్ధికి బీజేపీతో కలసి పని చేయాలని చెప్పారు.