Chennai: చెన్నైలో భారీ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు.. నటి ఫిర్యాదుతో వెలుగులోకి.. ఆల్బమ్ నిండా మహిళా నటుల ఫొటోలే!
- ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా ఎర
- ఓ నటితో గడిపేందుకు రూ.40 లక్షలు రేటు ఫిక్స్
- ఆల్బమ్ లో పలువురు మహిళా నటుల ఫొటోలు, ధరలు
సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, వాట్సాప్ వేదికగా చెన్నైలో భారీ సెక్స్ రాకెట్‌ను నిర్వహిస్తున్న యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అన్నానగర్‌లో నివసించే తమిళ సినీ నటి జయలక్ష్మి ఫిర్యాదుతో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు అయింది. రిలేషన్ షిప్ డేటింగ్ సర్వీస్ పేరుతో కొన్ని రోజులుగా రెండు నంబర్ల నుంచి తన వాట్సాప్‌కు అభ్యంతరకరమైన మెసేజ్‌లు వస్తున్నట్టు ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. డేటింగ్ ఇష్టపడేవారి కోసం ఇది ప్రత్యేకమని, డేటింగ్ చేసేందుకు వీఐపీలు కూడా సిద్ధంగా ఉన్నారని, రూ.30 వేల నుంచి రూ.3 లక్షలు వరకు చెల్లించేందుకు రెడీగా ఉన్నారని మెసేజ్‌లు వస్తున్నట్టు ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
నటి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు వాట్సాప్ సందేశాలు ఎక్కడి నుంచి వస్తున్నదీ గుర్తించారు. విరుగంబాక్కానికి చెందిన మురుగ పెరుమాన్, కవియరసన్లే వీటిని పంపుతున్నట్టు నిర్ధారించుకుని ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. యువకుల నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లలోని ఫొటోలను, అందులోని వివరాలను చూసి పోలీసులు నిర్ఘాంతపోయారు. అందులో బోలెడంతమంది కోలీవుడ్ మహిళా నటుల ఫొటోలు, వారి ధరలతో సహా ఉన్నాయి.
ఆ ఫొటోల్లో ఉన్న ప్రముఖ యువ నటితో గడిపేందుకు రూ.40 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని ఓ కస్టమర్‌కు మెసేజ్ పెట్టినట్టు పోలీసులు తెలిపారు. ఇలా మొత్తం 70 మంది యువతుల అసభ్య ఫొటోలు, వారి రేట్లతో సహా ఉన్నట్టు పేర్కొన్నారు. వాట్సాప్ చాటింగ్‌లను సేకరించిన పోలీసులు.. ఫొటోలు, రేట్లు ఉన్న ఫొటో ఆల్బమ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ఎవరైనా పెద్దల హస్తం ఉందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.