bjp: బీజేపీ ఎన్నికల ప్రచార వ్యూహం.. దేశ వ్యాప్తంగా నిర్వహించనున్న ర్యాలీలు!
- 2019 సార్వత్రిక ఎన్నికలు లక్ష్యంగా ర్యాలీలు
- 400 లోక్ సభ స్థానాల్లో రెండు వందల ర్యాలీలకు ప్రణాళిక
- యాభైకి పైగా ర్యాలీల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ
వచ్చే సార్వత్రిక ఎన్నికలు లక్ష్యంగా బీజేపీ సన్నద్ధమవుతోంది. దేశ వ్యాప్తంగా ఎన్నికల ర్యాలీలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికలు లక్ష్యంగా 400 లోక్ సభ స్థానాల్లో రెండు వందల ర్యాలీలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్టు బీజేపీ వర్గాల సమాచారం.
వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి దేశంలోని 100 లోక్ సభ స్థానాల్లో యాభైకి పైగా ర్యాలీలు నిర్వహిస్తారని, ఆయా ర్యాలీలలో ప్రధాని మోదీ పాల్గొంటారని తెలుస్తోంది. రెండు నుంచి మూడు లోక్ సభ నియోజకవర్గాల మీదుగా ప్రతి ర్యాలీ వెళ్లేలా ఉంటుందని సమాచారం.
50 ర్యాలీలతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లోనూ మోదీ పాల్గొంటారని బీజేపీ నేతలు చెబుతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, పార్టీ సీనియర్ నేతలు రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీలు కూడా ఈ ర్యాలీల్లో పాల్గొననున్నారు.