kashmir: కశ్మీర్ సమస్యకు ఇదే గొప్ప పరిష్కారం: ఫరూక్ అబ్దుల్లా
- భారత్, పాక్ లలో ఉన్న కశ్మీర్ ల మధ్య స్వేచ్ఛా సరిహద్దులు ఉండాలి
- యూకే, ఐర్లండ్ ల మధ్య ఇలాంటి సరిహద్దు ఉంది
- కనీస ధ్రువపత్రాలతో ప్రజలు అటూఇటూ ప్రయాణించగలగాలి
యూకే పాలన కింద ఉన్న నార్త్ ఐర్లండ్ కు, దానికి ఆనుకుని ఉన్న ఐర్లండ్ దేశానికి మధ్య ఓపెన్ బోర్డర్ ఉందని... కశ్మీర్ సమస్యకు కూడా ఇదే గొప్ప పరిష్కార మార్గమని జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. సైనిక చర్యలు కశ్మీర్ సమస్యను పరిష్కరించలేవనే విషయాన్ని భారత్, పాకిస్థాన్ గుర్తించాలని చెప్పారు. ఇరు దేశాల్లో ఉన్న కశ్మీర్ జాతీయులు స్వేచ్ఛగా అటుఇటు తిరిగేలా సరిహద్దులు ఉండాలని సూచించారు. లండన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ మేరకు ప్రసంగించారు.
కశ్మీర్ సమస్యను పరిష్కరించే క్రమంలో ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నా, ప్రతి ఒక్కరూ అంగీకరించరనే విషయాన్ని ఇరు దేశాలు అర్థం చేసుకోవాలని... కనీసం 70 నుంచి 80 శాతం మంది ఇండియా, పాకిస్థాన్, జమ్ముకశ్మీర్, లఢక్ ప్రజలు అంగీకరిస్తే చాలని ఫరూక్ చెప్పారు. కనీస ధ్రువపత్రాలలో ప్రజలు అటూఇటూ ప్రయాణించేలా యూకే-ఐర్లండ్ ల మధ్య ఒప్పందం ఉందని... భారత్-పాక్ లు కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు.