Pakistan: లాహోర్ లో అడుగు పెట్టగానే నవాజ్ షరీఫ్ అరెస్ట్.. పోలీసుల అధీనంలో ఎయిర్ పోర్టు!
- లండన్ నుంచి బయలుదేరిన నవాజ్ షరీఫ్
- లాహోర్ చేరగానే అరెస్ట్
- అక్కడి నుంచి ఇస్లామాబాద్ జైలుకి తరలింపు
లండన్ నుంచి విమానంలో బయలుదేరిన పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన కూతురు మరియం ఈ రోజు సాయంకాలం లాహోర్ ఎయిర్ పోర్టులో అడుగు పెట్టగానే వారిని అరెస్ట్ చేయాలన్న ప్రయత్నాలలో పాకిస్థాన్ ప్రభుత్వం ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే లాహోర్ ఎయిర్ పోర్టును పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు.
గతంలో పాకిస్థాన్ కు మూడుసార్లు ప్రధానిగా పనిచేసి, ఆపై అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్న నవాజ్ కు కోర్టు ఇటీవల 10 సంవత్సరాల జైలుశిక్షను విధించిన సంగతి తెలిసిందే. జూలై 25న పాక్ లో సాధారణ ఎన్నికలు జరుగనుండగా, తన పార్టీని సమాయత్తం చేసేందుకు స్వదేశానికి రావాలని నవాజ్ నిర్ణయించుకున్నారు. ఆయన రాగానే అరెస్ట్ చేయాలని పోలీసులు చూస్తుండగా, దాన్ని అడ్డుకోవాలని నవాజ్ అనుచరులు భారీ ఎత్తున విమానాశ్రయానికి చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి.
దాదాపు 10 వేల మంది పోలీసులతో లాహోర్ ఎయిర్ పోర్టును దిగ్బంధించిన పోలీసులు, నవాజ్ ను, కూతుర్ని అక్కడి నుంచి హెలికాప్టర్లో నేరుగా ఇస్లామాబాద్ కి తరలించి జైలుకు పంపాలని భావిస్తున్నారు. ఇక నవాజ్ షరీఫ్ అరెస్ట్ వార్తలను ప్రత్యక్ష ప్రసారం చేయరాదని మీడియా సంస్థలకు ఆదేశాలు వెళ్లాయి.