Andhra Pradesh: ఏపీకి ర్యాంకు రాకుండా చేయాలని కేంద్రం కుట్ర చేసి విఫలమైంది: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
- ఏ రాష్ట్రంపైనా చూపని ప్రేమను ఇన్వెస్టర్లు ఏపీపై చూపుతున్నారు
- ఉండవల్లిలో టీడీపీ కార్యశాల
- నేతలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగం
సులభతర వాణిజ్య విభాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ర్యాంకు దక్కకుండా చేసేందుకు కేంద్రం శతవిధాలా ప్రయత్నించి విఫలమైందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఉండవల్లిలోని ప్రజాదర్బారు హాల్ లో నిర్వహించిన తెలుగుదేశం కార్యశాలకు హాజరైన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
ఎంత అడ్డుకుందామని చూసినా కేంద్రం విజయం సాధించలేదని, అప్పటికీ కొన్ని అంశాలను తొలగించారని ఆయన ఆరోపించారు. ఏం చేసినా ర్యాంకు రాకుండా అడ్డుకోలేక పోయిన కేంద్ర ప్రభుత్వం విధిలేని పరిస్థితుల్లో తొలి స్థానం ఇచ్చారని అన్నారు. ఇండియాలోని మరే రాష్ట్రంపైనా చూపని ప్రేమను పెట్టుబడిదారులు ఏపీపై చూపుతున్నారని ఈ ర్యాంకుతో మరోసారి తెలిసొచ్చిందని చంద్రబాబు అన్నారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాల్సిందేనని, నిధులు తక్కువని కేంద్రం భావిస్తే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి దానిని ఏర్పాటు చేద్దామని ప్రతిపాదించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను సాధించుకున్నట్టే రైల్వే జోన్ ను కూడా సాధించుకుందామని ఆయన పిలుపునిచ్చారు.