railway: ఇకపై మొబైల్ యాప్ ద్వారా సాధారణ రైల్వే టికెట్లు బుక్ చేసుకోవచ్చు!
- సాధారణ టికెట్ల బుకింగ్ కు మొబైల్ యాప్ ఆవిష్కరణ
- ఈ నెల 15 అర్ధరాత్రి నుంచి అందుబాటులోకి సేవలు
- ద.మ. రైల్వే పరిధిలోని అన్ని స్టేషన్లకు ఈ యాప్ సేవలు
ఇకపై రైల్వే సాధారణ ప్రయాణికులు తమ టికెట్లను మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో యూటీఎస్ ఆన్ లైన్ మొబైల్ యాప్ ను దక్షిణ మధ్య రైల్వే రూపొందించింది. ఈ యాప్ ను దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్ కుమార్ ఈరోజు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రిజర్వేషన్లు లేని సాధారణ ప్రయాణికుల కోసం యూటీఎస్ యాప్ ను ఆవిష్కరించామని, ఈ నెల 15వ తేదీ అర్ధరాత్రి నుంచి ఈ యాప్ సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అన్ని రైల్వేస్టేషన్లలో ఈ యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని, ప్లాట్ ఫాం టికెట్లను కూడా దీని ద్వారా బుక్ చేసుకోవచ్చని, యూటీఎస్ యాప్ సేవలను త్వరలోనే దేశ వ్యాప్తంగా అందిస్తామని అన్నారు.