Roger Federer: 35 ఏళ్ల తరువాత వింబుల్డన్ సెమీస్ లో సౌతాఫ్రికన్... సుదీర్ఘంగా సాగిన పోరులో రోజర్ ఫెదరర్ కు షాక్!
- ఐదు సెట్లు సాగిన మ్యాచ్
- చివరి సెట్లో 13-11 తేడాతో కెవిన్ ఆండర్ సన్ విజయం
- క్వార్టర్ ఫైనల్లోనే ముగిసిన ఫెదరర్ ఆట
లండన్ లో జరుగుతున్న వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ పోటీల్లో స్విస్ స్టార్, 9వ సారి ట్రోఫీపై కన్నేసిన రోజర్ ఫెదరర్ కు క్వార్టర్ ఫైనల్స్ లోనే ఎదురుదెబ్బ తగిలింది. సౌతాఫ్రికాకు చెందిన కెవిన్ ఆండర్ సన్ సుదీర్ఘంగా సాగిన పోరులో ఫెదరర్ పై చిరస్మరణీయ విజయం సాధించారు. 1983లో కెవిన్ కర్రన్ తరువాత వింబుల్డన్ సెమీస్ ఆడనున్న తొలి సౌతాఫ్రికా ఆటగాడిగా కెవిన్ ఆండర్ సన్ చరిత్ర సృష్టించాడు. దాదాపు 4 గంటలా 14 నిమిషాల పాటు ఆట సాగింది. ఐదు సెట్లలోనూ హోరాహోరీ పోరు జరిగింది. గెలుపు ఇద్దరి మధ్యా దోబూచులాడింది.
చివరికి ఆండర్ సన్ చేతిలో 2-6, 6-7 (5), 7-5, 6-4, 13-11 తేడాతో ఫెదరర్ ఓటమి పాలయ్యాడు. ఈ మ్యాచ్ లో చెప్పుకోవాల్సింది నిర్ణయాత్మకమైన ఐదో సెట్ గురించే. తొలి నాలుగు సెట్లనూ చెరో రెండు గెలుచుకున్న తరువాత, ఐదో సెట్ దాదాపు రెండు గంటల పాటు సాగింది. సుదీర్ఘంగా సాగే పోరులో విజయాన్ని సాధించడం అలవాటుగా చేసుకున్న ఫెదరర్ కు ఈ మ్యాచ్ మాత్రం అచ్చిరాలేదు. కాగా, మరో మ్యాచ్ లో రఫెల్ నాదర్ మాత్రం గట్టెక్కాడు. జువాన్ మార్టిన్ డెల్ పాత్రోతో జరిగిన పోరులో 7-5, 6-7 (3), 4-6, 6-4, 6-4 తేడాతో గెలిచి సెమీస్ లోకి అడుగు పెట్టాడు.