Bihar: మందు బాబుల కోసం చట్టాన్ని సవరిస్తున్న బీహార్ ప్రభుత్వం.. తొలిసారి పట్టుబడితే రూ.50 వేల జరిమానా!
- తొలిసారి రూ.50 వేలు కట్టి బయటపడొచ్చు
- లేదంటే మూడు నెలల జైలు శిక్ష
- ప్రతిపాద సవరణలకు కేబినెట్ ఓకే
మద్య నిషేధం అమలులో బీహార్లో మందుబాబుల కోసం ప్రభుత్వం మద్య నిషేధ చట్టంలో కొన్ని మార్పులు చేసింది. ప్రతిపాదిత బిల్లు వర్షాకాల సమావేశాల్లో అసెంబ్లీ ముందుకు రానుంది. ఇందులో భాగంగా మద్యం తాగి తొలిసారి పట్టుబడిన వారు ఇకపై రూ.50 వేల జరిమానా కట్టి బయటపడొచ్చు. లేదంటే మూడు నెలల శిక్ష తర్వాత బయటకు రావచ్చు. బుధవారం ప్రతిపాదిత బిల్లుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
బీహార్ అడ్వకేట్ జనరల్ లలిత్ కిషోర్ మాట్లాడుతూ.. మద్యం తాగి తొలిసారి పట్టుబడిన వారు రూ.50 వేల జరిమానా చెల్లించడం ద్వారా బయటపడొచ్చని తెలిపారు. లేదంటే మూడు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం నాన్ బెయిలబుల్ కేసులుగా నమోదు చేస్తున్న పోలీసులు ఇకపై బెయిలబుల్గానూ పరిగణించనున్నారు. మద్యం తాగి పట్టుబడి ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్న వారికి కూడా ఇది వర్తిస్తుందని తెలిపారు. మూడు నెలల జైలు శిక్ష పూర్తయిన వారిని వదిలిపెట్టనున్నట్టు చెప్పారు. రెండోసారి మాత్రం ఇదే తప్పుచేసి పట్టుబడితే రెండు నుంచి ఐదేళ్ల శిక్ష తప్పదన్నారు. మద్యం తయారు చేస్తూ, అమ్ముతూ పట్టుబడితే మాత్రం తొలిసారి రెండేళ్లు, రెండోసారి పదేళ్ల జైలు శిక్ష విధించనున్నట్టు తెలిపారు.