Jagan: జపాన్‌లో దారుణం: పని తప్పించుకునేందుకు 20 మందికి విషమిచ్చి చంపిన నర్సు

  • సెలైన్ బాటిల్‌లో విషం కలిపి హత్య
  • విచారణలో విస్తుపోయే నిజాలు
  • మరణశిక్ష పడే అవకాశం

జపాన్‌లో అత్యంత దారుణమైన ఘటన జరిగింది. పని నుంచి తప్పించుకునేందుకు ఓ నర్సు ఏకంగా 20 మంది వృద్ధులకు విషమిచ్చి చంపేసింది. టోక్యోకు చెందిన ఆయూమీ కుబోకి (31) ఓ ప్రైవేటు ఆసుపత్రిలో రెండేళ్లపాటు నర్సుగా పనిచేసింది. ఆ సమయంలో 88 ఏళ్ల వృద్ధుడొకరు అనుమానాస్పద స్థితిలో ఆసుపత్రిలో మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టగా విస్మయ పరిచే వాస్తవాలు వెలుగుచూశాయి.
 
ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న నర్సు విచారణలో చెప్పినది విని పోలీసులు నిర్ఘాంతపోయారు. రోగుల సెలైన్ బాటిళ్లలో క్రిమిసంహారక మందును కలపడం ద్వారా 20 మందిని చంపేసినట్టు వివరించింది. వారిని ఎందుకు చంపావన్న ప్రశ్నకు ఆమె చెప్పింది విన్న పోలీసులు షాక్ అయ్యారు. రోగులపై తనకు వ్యక్తిగతంగా ఎటువంటి ద్వేషమూ లేదని, కేవలం పని నుంచి తప్పించుకునేందుకే ఆ పని చేశానని వివరించింది.

ఆసుపత్రిలో తన పర్యవేక్షణలో ఉన్న రోగుల్లో ఎవరైనా చనిపోతే మొత్తం భారం ఆయూమీపైనే పడేది. రోగి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతోపాటు మిగతా కార్యక్రమాలన్నీ పూర్తయ్యాకే ఇంటికి వెళ్లాల్సి వచ్చేది. దీనివల్ల ఒక్కోసారి చాలా ఆలస్యమయ్యేది. దీంతో ఇక ఇలా కాదని ఓ ఆలోచన చేసిన నర్సు తన డ్యూటీ ముగుస్తుందనగా రోగులకు ఎక్కిస్తున్న సెలైన్ బాటిల్‌లో విషం కలిపేది. దీంతో ఆమె విధులు ముగించుకుని వెళ్లిన కాసేపటికే వారు మృతి చెందేవారు. విచారణలో నేరాన్ని అంగీకరించిన ఆయూమీకి మరణశిక్ష పడే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News