Gall jayadev: మోదీ సర్కారుపై మళ్లీ అవిశ్వాసం.. జమిలి ఎన్నికల వెనక ఆ మూడు రాష్ట్రాలు: టీడీపీ ఎంపీ గల్లా
- రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలో బీజేపీకి గడ్డుపరిస్థితి
- అందుకే ముందస్తు ఎన్నికలు
- రైల్వే జోన్ గురించి నోరెత్తని పవన్!
ఆంధ్రప్రదేశ్‌కు అన్ని విషయాల్లోనూ అన్యాయం చేస్తున్న మోదీ సర్కారును వదిలిపెట్టే ప్రసక్తే లేదని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. మోదీ సర్కారుపై మళ్లీ అవిశ్వాసం పెట్టనున్నట్టు ఆయన తెలిపారు. ఇటీవల టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలిగా ఎన్నికైన గల్లా అరుణకుమారికి, పార్లమెంటులో స్పీచ్‌తో అదరగొట్టిన గల్లా జయదేవ్‌కు తిరుపతిలో అభినందన కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా జయదేవ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనూ తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహం గురించి గురువారం నాటి పార్టీ పార్లమెంటరీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నారు.
మూడు రాష్ట్రాల్లో ప్రయోజనం పొందేందుకు దేశమంతా ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ యోచిస్తోందని గల్లా జయదేవ్ ఆరోపించారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోయే పరిస్థితి ఉందని సర్వేలన్నీ చెబుతున్నాయని, దీని నుంచి బయటపడేందుకే జమిలి ఎన్నికలను తెరపైకి తెచ్చారని జయదేవ్ ఆరోపించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పైనా జయదేవ్ విమర్శలు గుప్పించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి అంటూ గొంతు చించుకుంటున్న పవన్ విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు గురించి ఎందుకు పెదవి విప్పడం లేదని ప్రశ్నించారు. అనంతరం గల్లా అరుణకుమారి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని, అయితే రాజకీయాల్లో మాత్రం చురుగ్గా ఉంటానని స్పష్టం చేశారు.