China: 2050 కల్లా చైనా జనాభా భారత జనాభాలో 65 శాతం మాత్రమే ఉంటుందట!
- చైనాలో 2016 నాటికి 60 ఏళ్లు దాటిన వారి సంఖ్య 23 కోట్లు
- జనాభాలో 16.7 శాతం వృద్ధులే
- కుటుంబ నియంత్రణ విధానం ప్రమాదమంటోన్న నిపుణులు
- నిబంధన వల్ల 40 కోట్ల వరకు తగ్గిపోయిన చైనా జనాభా
ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న చైనాలో కుటుంబ నియంత్రణ విధానాన్ని అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఒక బిడ్డ ముద్దు, రెండో బిడ్డ వద్దు అనే నినాదంతో ఆ నిబంధనను పాటించిన చైనా 2016లో దాన్ని సవరించి ఇద్దరిని కనవచ్చన్న విధానాన్ని తీసుకొచ్చింది. కాగా, కుటుంబ నియంత్రణపై ఆ దేశ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇది ఇలాగే కొనసాగితే 2050 కల్లా తమ దేశ జనాభా భారత జనాభాలో 65 శాతం మాత్రమే ఉంటుందని అంటున్నారు. అంతేగాక, అది చైనా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని అన్నారు. చైనాలో 2016 నాటికి 60 ఏళ్లు దాటిన వారి సంఖ్య 23 కోట్లు (జనాభాలో 16.7 శాతం) గా ఉంది.
అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఓ దేశ జనాభాలో పది శాతం లేక అంతకన్నా అధిక సంఖ్యలో వృద్ధులు ఉంటే దానిని వృద్ధాప్య సమాజంగా గుర్తిస్తారు. చైనా కుటుంబ నియంత్రణ విధానం ఇలాగా కొనసాగితే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో ఉన్న ఒకే సంతానం అన్న నిబంధన వల్ల 40 కోట్ల వరకు చైనా జనాభా తగ్గిపోయిందని వారు పేర్కొన్నారు.